“మీరు మనుషులు కాదా ..?”.. కొత్త రాజకీయం చేస్తున్న పవన్ కల్యాణ్ ఇలాంటి మాటను.. ఏ చంద్రబాబునో.. మరో లోకేష్‌నో అంటే.. పెద్ద విశేషం ఏమీ లేదు. కానీ ఈ మాట అన్నది ఆయన ఫ్యాన్స్‌ని. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో జనసేన అధినేత పవన్ అభిమానులపై ఆగ్రహంతో ఊగిపోయారు. సంతకవిటి మండలంలో వాల్తేరు బ్రిడ్జి నిర్మాణం కోసం దీక్షలు చేస్తున్న గ్రామస్తులకు సంఘీభావం తెలిపేందుకు పవన్ వెళ్లారు. పవన్ వస్తున్నారన్న విషయం తెలుసుకుని చుట్టుపక్కల గ్రామాల యువత భారీగా అక్కడికి వచ్చారు. అభిమాన హీరోని చూసిన ఆనందంతో ఈలలతో గోల చేశారు. కాబోయే సీఎం పవన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఆ స్లోగన్స్ విని మొదట్లో… సంతోషపడ్డ పవన్.. ఎంతకూ ఆగకపోవడంతో… టెంపర్ తెచ్చుకున్నారు. ఆపాలని.. ఒకటికి రెండు సార్లు విజ్ఞప్తి చేశారు. రాజకీయ నాయకుల భాష ప్రకారం.. ఆపాలంటే… పెంచాలనుకున్నట్లు వాళ్లు. మళ్లీ పెంచేశారు. దీంతో పవన్‌కు చిర్రెత్తుకొచ్చింది. 600 రోజులుగా గ్రామస్తులు దీక్షలు చేస్తుంటే బాధగా లేదా అంటూ అభిమానులపై చిందులేశారు. అయినా వినకపోవటంతో మైక్ తీసుకుని మీరు మనుషులు కాదా అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. విశేషం ఏమిటంటే.. ఇలా అరుస్తున్నప్పుడు కూడా కొంత మంది ఈలలు వేసి ప్రొత్సహించే ప్రయత్నం చేశారు.. ఆయనేదో సినిమా డైలాగ్ చెబుతున్నారని వాళ్లు ఫీలయ్యారు. పవన్ కల్యాణ్ ఆగ్రహంపై.. జనసేన నేతలు విచిత్రమైన వాదన వినిపిస్తున్నారు. గత 3 రోజుల నుంచి తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న పవన్ లో తీవ్రమైన అలసటకు గురయ్యారని… ఇలాంటి సమయంలో ఫాన్స్ విసిగించటంతో ఆగ్రహం వ్యక్తం చేశారని చెబుతున్నారు.
నిజానికి పవన్ కల్యాణ్ ఫ్యాన్స్.. ఆయన ఎదుట చేసిన అల్లరి చిన్నదే. బయట ఆయన ప్యాన్స్ చేసే అల్లరి ఏ స్థాయిలో ఉంటుందో.. గతంలో సినిమా ఫంక్షన్లలో చూశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తున్నారు. విమర్శను ఏ మాత్రం తట్టుకోలేని పీకే ఫ్యాన్స్.. అత్యంత దారుణమైన పదజాలాన్ని వాడుతుంటారు. ఎంత గౌరవనీయుడినైనా.. కించ పరచడానికి వెనుకాడరు. రాజకీయంగానే కాదు.. వ్యక్తిగత విషయాల్లోనూ వారు అంతే. వారిని పవన్ కల్యాణ్ కూడా కంట్రోల్ చేయలేదు. వారంతే… మనుషులే.. కనీ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్.. అనుకోవాలంతే…!
—— సుభాష్