జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెనాలి సీటును తమ పార్టీకి ప్రకటించుకున్నారు. అక్కడ తమ పార్టీని గెలిపించాలని కోరి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. కానీ ఆయన సీటు మనది.. గెలిచేది మనమేనని వ్యాఖ్యానించడంతో పొత్తుల్లో తెనాలి సీటును వదులుకునేది లేదని చెప్పినట్లుగా అయింది. ఇటీవల నాదెండ్ల మనోహర్ విషయంలో జనసేనలో వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. కానీ పవన్ కల్యాణ్ మాత్రం ఆయనకు అండగా ఉన్నారు. ఈ క్రమంలో తెనాలి కార్యకర్తలను పిలిపించి సీటు మనదేనని ప్రకటించేశారు.
టీడీపీతో పొత్తుల చర్చలు ఎక్కడి వచ్చాయో స్పష్టత లేదు. బీజేపీతోనే నడుస్తామని టీడీపీ కలిసి వస్తుందో లేదోనన్నట్లుగా పవన్ మాట్లాడుతున్నారు. బీజేపీతో కలిసి పోటీ చేయడానికి టీడీపీ ఏ మాత్రం ఆసక్తి చూపించడం లేదు. జగన్ రెడ్డిపై బీజేపీ అభిమానం చూపిస్తోందని.. ఎంత మాత్రం బీజేపీతో కలిసే ప్రశ్నే లేదని అంటోంది. జగన్ రెడ్డిపై తాము చెప్పినట్లుగా చర్యలు తీసుకుంటే ఆలోచిస్తామంటోంది. కానీ బీజేపీ అంత రిస్క్ తీసుకోవడం లేదు.
దీంతో జనసేన అంతర్గతంగా టీడీపీతో సంప్రదింపులు పూర్తి చేసి .,. సీట్ల ఎంపికల వరకూ వచ్చిందేమో కానీ.. తెనాలి సీటును ప్రకటించేసుకున్నారు. సత్తెనపల్లికి కన్నా లక్ష్మినారాయణను టీడీపీ ఖరారు చేయడంతో ఇక తమ పార్టీలో నెంబర్ టుగా ఉన్న నాదెండ్ల కోసం.. తెనాలి సీటును పట్టుబట్టక తప్పని పరిస్థితి జనసేనకు ఏర్పడింది. అక్కడ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఏలా స్పందిస్తారన్నది కీలకం.