ఆంధ్రప్రదేశ్ లో అన్ని స్థానాల్లోనూ పోటీ చేసేందుకు జనసేన పార్టీ సిద్ధమౌతున్న సంగతి తెలిసిందే. అయితే, ఇదే సమయంలో తెలంగాణలో జనసేన పార్టీ పరిస్థితి ఏంటనేది ఆగస్టు నెలలో ప్రకటిస్తానని పవన్ కల్యాణ్ మే నెలలో ప్రకటించారు. ఆంధ్రాలో పార్టీ నిర్మాణం పూర్తవగా తెలంగాణపై ప్రకటన చేస్తాననీ, అన్ని స్థానాల్లో పోటీ చేస్తామా, కొన్ని స్థానాల్లోనే పోటీ చేస్తామా అనేది స్పష్టంగా చెబుతానని అన్నారు. దీనికి అనుగుణంగానే తెలంగాణ విషయంలో త్వరలోనే పవన్ కల్యాణ్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందని జనసేన వర్గాలు అంటున్నాయి.
జనవరి నెలలో కొండగట్టు హనుమాన్ ఆలయానికి వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచే యాత్ర ప్రారంభించారు. ఇకపై పూర్తిస్థాయి రాజకీయాల్లో ఉంటానంటూ కీలక ప్రకటన చేశారు. అదే ఊపులో ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో పర్యటించారు. ఆగస్టు తరువాత మళ్లీ వస్తానని అప్పుడే చెప్పారు. దానికి అనుగుణంగానే… త్వరలోనే తెలంగాణ పర్యటన షెడ్యూల్ ను పవన్ కల్యాణ్ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం ఆంధ్రాలో పవన్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని త్వరలోనే పూర్తి చేసుకుని… తెలంగాణ యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నట్టు సమాచారం.
2019 అసెంబ్లీ ఎన్నికలల్లోపు తెలంగాణలో అన్ని జిల్లాల్లోనూ పర్యటించాలని పవన్ భావిస్తున్నట్టు సమాచారం. అంటే, తెలంగాణలో కూడా ఏపీలో మాదిరిగానే అన్ని స్థానాల్లో పోటీ చేస్తానని పవన్ ప్రకటించే అవకాశం లేకపోలేదని అనిపిస్తోంది. ఆంధ్రాతోపాటు తెలంగాణలో కూడా పెద్ద సంఖ్యలో పవన్ కి అభిమానులు ఉన్న మాట వాస్తవమే. రాష్ట్రంలో జనసేన యాక్టివ్ అయితే… చేరేందుకు వివిధ రంగాల నుంచి కొందరు సిద్ధంగా ఉన్నవారు అంటున్నారు! త్వరలోనే అన్ని నియోజక వర్గాల్లోనూ పెద్ద ఎత్తున జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలనీ పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. అంతేకాదు, తెలంగాణలో కూడా జనసేన ఎవ్వరితోనూ పొత్తు పెట్టుకునే అవకాశం లేదనీ, సొంతంగానే అన్ని స్థానాల్లోనూ బరిలోకి దిగే అవకాశం ఉందని జనసేన పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పవన్ పర్యటన షెడ్యూల్ ఖారారు కాగానే, ఇక్కడ కూడా పార్టీ కార్యకలాపాలు ఊపందుకుంటాయని అంటున్నారు.
నిజానికి, ఏపీలో పర్యటన ముగించిన మాత్రాన… ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు కావాల్సిన పనులన్నీ పూర్తయినట్టు కాదు కదా! అక్కడ 175 స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారూ, అన్ని నియోజక వర్గాల్లో క్షేత్రస్థాయి పార్టీ కమిటీల పరిస్థితి ఏంటనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. పార్టీపరంగా ఏపీలో చేయాల్సినవి చాలా ఉన్నాయి. నిజానికి, జనసేనకు ఏపీలోనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి… ముందుగా ఇక్కడే ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది! తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీకి అవకాశం ఉందా అనేది కూడా ప్రశ్నే..? ఈ మధ్య, తెలంగాణ జన సమితి పేరుతో కోదండరామ్ పెట్టిన పార్టీ కూడా ఎంతో కొంత ప్రభావం చూపడం కోసం అవస్థలుపడాల్సి వస్తోంది.