డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ టీటీడీ ఈవో, జేఈవో, టీటీడీ చైర్మన్ క్షమాపణలు చెప్పాలని పట్టుబడుతున్నారు. డిప్యూటీ సీఎంగా ఉన్న తానే క్షమాపణలు చెప్పానని మీరెందుకు చెప్పరని నిలదీస్తున్నారు. పిఠాపురంలో పర్యటించిన ఆయన తిరుమల ఘటనపై స్పందించారు. సంక్రాంతి సంబరాలు భారీగా చేసుకుందామని అనుకున్నామని కానీ తిరుపతి ఘటనల వల్ల చాలా సింపుల్గా చేసుకుంటున్నారు. ఈ ఘటనలో పోలీసులు, అధికారుల నిర్లక్ష్యం పూర్తి స్థాయిలో ఉందన్నారు. అయినా వారు ఎందుకు క్షమాపణలు చెప్పడం లేదని ప్రశ్నించారు. బాధితుల ఆర్తనాధాలు వింటే బాధ ఏంటో అర్థమవుతుందని .. క్షమాపణ చెప్పి తీరాలని, వేరే దారి లేదని హెచ్చరించారు.
క్షమాపణ చెప్పటం వల్ల పోయిన ప్రాణాలు రావు కాని, మీరు కోరే క్షమాపణతో ప్రజలు గౌరవంగా ఫీలవుతారని అన్నారు. గరుడ ఉత్సవాలకు నాలుగు లక్షల మంది వస్తే విజయవంతంగా నిర్వహించగా కేవలం 2500 మంది ఉన్న స్థలంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల దురదృష్టకర ఘటన జరిగిందని పవన్ గట్టి అభిప్రాయంతో ఉన్నారు. ఈ అంశంపై టీటీడీ చైర్మన్, ఈవో, డిప్యూటీ ఈవో ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరకంగా మారింది.
ప్రతి ఒక్కరూ ఎవరి బాధ్యత వాళ్లు సరిగా నిర్వహించినట్లయితే తిరుపతి లాంటి ఘటనలు పునరావృతం కావని అన్నారు. ఒక్క అధికారి సక్రమంగా పనిచేయకపోవడం వల్ల ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం, మరికొందరు క్షతగాత్రులు కావడంతో జిల్లా పోలీసు యంత్రాంగం మొత్తం ఫలితం అనుభవించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఫ్యాన్స్ పైనా పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తిరుపతి పర్యటనలో తనను చూసి కేరింతలు, ఈలలు కొట్టడాన్ని తప్పుపడుతూ యువత సందర్భోచితంగా వ్యవహరించాలని సూచించారు.