“పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు? చాలా రోజులుగా కనబడటం లేదు. తెదేపా, భాజపాల తరపున ఎన్నికలలో ప్రచారం చేసి మద్దతు ఇస్తున్నప్పటికీ అవి తప్పులు చేస్తే ప్రజల తరపున నిలబడి వాటిని నిలదీస్తానని హామీ ఇచ్చారు. అధికారం కోసం కాదు ప్రశ్నించడానికే పార్టీ పెడుతున్నానని చెప్పిన ఆయన ఇప్పుడు తెదేపా ప్రభుత్వం ఎన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకొంటున్నా ఎందుకు ప్రశ్నించడం లేదు? అసలు ఆయన ఎక్కడున్నారున్నారని ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు,” అని ఏపి రాష్ట్ర బిసి సంఘం అధ్యక్షుడు డేరంగుల ఉదయ్ కిరణ్ ప్రశ్నించారు.
ప్రభుత్వాలని ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఆ చిన్న పని కూడా చేయకపోవడంతో, రాష్ట్రంలో చాలా మంది ఇదే ప్రశ్నని గత రెండేళ్లుగా అడుగుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ వేటికీ స్పందించడంలేదు. సినీ పరిశ్రమలో చాలా మంది హీరోలు ఉన్నప్పటికీ ఆయనకి ఒక్కరికే ఈ సమస్య ఎందుకు ఎదుర్కోవలసి వస్తోందంటే జనసేన పార్టీతో రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చినందునే! ఈ రెండేళ్ళలో రెండు మూడుసార్లు మాత్రమే ప్రజలు, మీడియా ముందుకు వచ్చి రాజకీయాల గురించి మాట్లాడారు. వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తామని చెప్పారు కానీ ఈలోగా పార్టీని నిర్మించుకొనే ప్రయత్నాలు కూడా చేయలేదు. ఎందుకంటే పార్టీని నడిపించడానికి తనవద్ద తగినంత డబ్బు లేదని చెపుతుంటారు.
ఆయన ఇప్పటికిప్పుడు రాజకీయాలలోకి రాలేకపోయినా, వచ్చే ఎన్నికల నాటికయినా వస్తారనే నమ్మకం తన అభిమానులకి కలిగించడం లేదు. ఒకవేళ వచ్చే ఉద్దేశ్యం ఉన్నట్లయితే ప్రత్యేక హోదా, రైల్వేజోన్, ప్రజా సమస్యలపై తన అభిప్రాయమేమిటో చెప్పి తన అభిమానులని అందుకు ప్రోత్సహించవచ్చు. కానీ ఆ పని చేయడం లేదు. తన అభిమానులని ప్రోత్సహించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఇబ్బంది కలిగించినట్లయితే తెదేపా, భాజపాలతో ఉన్న మిత్రత్వం చెడిపోతుందనే భయం వల్ల కావచ్చు లేదా వచ్చే ఎన్నికలలో ఏవిధంగా ముందుకు వెళ్ళేది ఇప్పుడే అంచనా వేయడం కష్టం కనుక తొందరపడి ఏదో ఒకటి మాట్లాడి కొత్త శత్రువులని సృష్టించుకోవడం ఎందుకు? అనే ఆలోచన కావచ్చు లేదా అసలు రాజకీయాలలోకి రావాలనే ఆసక్తికోల్పోవడం వలన పవన్ కళ్యాణ్ మౌనం వహిస్తున్నరేమోనని అనుమానించవలసి వస్తోంది. ఒకవేళ ఆయన మళ్ళీ రాజకీయాలలో రాదలచుకోకపోతే అదే విషయం ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పేస్తే ఇక రాజకీయ నేతలు, పార్టీలు ఎవరూ ఆయన జోలికిరారు..ఇటువంటి విమర్శల బాధ తప్పుతుంది కదా?
ఆయనపై ఈ విమర్శలు గుప్పించిన డేరంగుల ఉదయ్ కిరణ్, ఇప్పటికీ పవన్ కళ్యాణ్ స్పందించకపోతే ఎన్నికల సంఘం ఆయన పార్టీని రద్దు చేయాలని కోరారు. ఆ పని చేస్తే కాగల కార్యం గందర్వులే చేసినట్లవుతుందేమో!