ప్రజలు క్యూలో చనిపోకుండా, గ్రామ వాలంటీర్ల తో ఉల్లిపాయలను డోర్ డెలివరీ చేయాల్సిందిగా పవన్ కళ్యాణ్ జగన్ రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. సాంబిరెడ్డి అనే వృద్ధుడు ఉల్లిపాయల కోసం చాంతాడంత క్యూ లైన్ లో నుంచుని, ఆ క్యూ లోనే గుండెపోటుతో చనిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
నిత్యావసర సరుకుల కోసం క్యూలో నిలబడి వృద్ధుడు చనిపోవడం తనని ఎంతగానో కలిచివేసింది అని వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ట్వీట్ చేస్తూ, “మీరు ప్రజలని క్యూలలో నుంచోపెట్టి చంపేకంటే , మీరు నియమించిన గ్రామ వాలంటీర్లను ఉపయోగించి ,ప్రజలు ఇళ్ల దగ్గరికే కిలో 25 రూపాయలకే ఉల్లిపాయల సరఫరా ఎందుకు చేయట్లేదో, జగన్ రెడ్డి గారు వివరణ ఇవ్వాలి .శ్రీ జగన్ రెడ్డి గారు నేతృత్వంలో నడుస్తున్న వైసీపీ ప్రభుత్వం మతమార్పిళ్లు, కూల్చివేతలు , కాంట్రాక్టు రద్దులు మీద పెట్టిన దృష్టి ,సగటు ప్రజల అవసరాలు మీద, రైతుల కష్టాల మీద పెట్టుంటే బాగుండేది. ”
ఒకవేళ అంతగా కావాలంటే ఈ పథకానికి “జగనన్న ఉల్లిపాయలు పథకం” అని పేరు పెట్టినా పర్వాలేదు అని పవన్ కళ్యాణ్ కొసమెరుపు ఇచ్చారు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.