అమరావతిలో రాజధాని వద్దని తాను ఎప్పుడూ అనలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. తాను రాజధాని అక్కడ వద్దన్నట్లుగా గతంలో ప్రకటించినట్లు.. మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించడాన్ని పవన్ కల్యాణ్ తప్పు పట్టారు. అన్నీ తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. మంత్రులందరూ.. వైసీపీ నేతల్లానే వ్యవహరిస్తున్నారు తప్ప.. ఆంధ్రప్రదేశ్ కోసం పని చేస్తున్న మంత్రుల్లా పని చేయడం లేదని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తే ఎవరు వద్దన్నారని ప్రశ్నించారు. అమరావతిని అందరి రాజధానిగా మార్చే సంకల్పంతో పని చేయాలని..గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని సరిదిద్దాలని కోరారు. ఇప్పటిలాగే గందరగోళన నిర్ణయాలు తీసుకుంటే…తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
రాజధానిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని పవన్ డిమాండ్ చేశారు. అమరావతిని రాజధానిగా ఉంచుతారా? లేదా? చెప్పాలన్నారు. రాజధానిని పొలిటికల్ గేమ్‌గా చూడొద్దన్నారు. రాజధానిని తరలిస్తామంటే జనసేన ఒప్పుకోదని … రాజధాని ప్రాంత ప్రజలకు అండగా నిలబడతామని ప్రకటించారు. రాజధాని రైతుల సమస్యలపై అవసరమైతే.. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాను కలుస్తానన్నారు. రాజధాని రైతులకు మద్దతుగా పవన్ కల్యాణ్ రెండు రోజుల పర్యటన ప్రారంభించారు. తొలి రోజు నిడమర్రు, కూరగల్లులో పర్యటించిన ఆయన కొండవీటి వాగు వద్ద వంతెన పనుల్ని పరిశీలించారు. ఆ తర్వాత పలు భవనాల నిర్మాణాలను పరిశీలించారు. తాను గతంలో… రాజధానిని వ్యతిరేకించలేదని.. బలవంతపు భూసేకరణను మాత్రమే వ్యతిరేకించానని పవన్ కల్యాణ్ తెలిపారు.
జనసేన తరపున.. రాజధాని విషయంలో.. ఓ క్లారిటీ ఇచ్చేందుకు పవన్ కల్యాణ్ ప్రయత్నించారు. గత సర్కార్ హయంలో జరిగిన తప్పులపైనే ప్రశ్నించాను కానీ… రాజధానికి వ్యతిరేకం కాదని.. అంతిమంగా ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి రాజధాని తరలింపు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు కాబట్టి.. మరో రోజు రాజధానిలో పర్యటించినా… రైతులకు మద్దతుగా మాట్లాడటం తప్ప.. పవన్ కల్యాణ్.. పోరాట కార్యాచరణ ఏమీ ప్రకటించకపోవచ్చని భావిస్తున్నారు.