తెలుగుదేశం పార్టీని కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్టీ రామారావు స్థాపించారన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్! జనసేన పార్టీ ఏర్పాటు చేసిన సందర్భం వేరన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత, బాధ్యతతో కూడిన నాయకత్వం లేకుండా, నిలకడలేని మాటలు మాట్లాడుతూ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడలేని స్థితిలో నాయకులుంటే… ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు నిలబడ్డ పార్టీ జనసేన అన్నారు. తెలంగాణ నాయకులు ఆంధ్రులను అవమానించి మాట్లాడుతున్న సమయంలో, ఆంధ్రుల గొంతు వినిపించడానికి పుట్టింది జనసేన పార్టీ అని పవన్ చెప్పారు. చెయ్యని తప్పునకు ఆంధ్రులను తెలంగాణ నాయకులు తిడుతుంటే, వారికి నిరసన తెలపడం కోసం పుట్టింది జనసేన పార్టీ అన్నారు! కాకినాడలో జరిగిన సభలో పవన్ మాట్లాడుతూ… ఈ వ్యాఖ్యలు చేశారు.
అవినీతి లేని పాలన అందిస్తారని నమ్మి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇచ్చాననీ, కానీ ఈరోజున ఎక్కడ చూసినా అవినీతే అని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతీ గ్రామంలో సమస్యలున్నాయన్నారు. వందల కోట్ల ఆదాయాన్ని వదులుకుని తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. ఆంధ్రాలో కులాల ఐక్యత తాను కోరుకుంటున్నాననీ, కుల రాజకీయాలు చేస్తూ పోతే రాష్ట్రం బీహార్ తరహాగా మారిపోతుందన్నారు. ప్రసంగంలో ఓ సందర్భంలో ప్రజల్లోంచి సీఎం సీఎం అని నినాదాలు వినిపిస్తే… ఇంకా చెయ్యండి చెయ్యండి అంటూ పవన్ ప్రోత్సాహించారు! ఇలా పదేపదే అంటుంటే అదే నిజమౌతుందన్నారు.
కాకినాడ సభలో పవన్ మాటల్లో స్పష్టంగా కనిపించింది ఏంటంటే.. ఆంధ్రుల ఆత్మగౌరవం అనే కాన్సెప్ట్ ని మళ్లీ తెర మీదికి తెచ్చే ప్రయత్నం పవన్ మొదలుపెట్టినట్టు అనిపిస్తోంది. ఆ సెంటిమెంట్ ను మరోసారి రగిలించడం ద్వారా పార్టీకి మైలేజ్ పెంచుకోవచ్చనేది వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే, తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రులు ఎదుర్కొన్న పరిస్థితులు పదేపదే గుర్తు చేసేందుకు పవన్ ప్రయత్నించారు. అంతేకాదు, ఏకంగా తెలుగుదేశం పార్టీ ఏర్పడ్డ నాటి పరిస్థితులు… జనసేన పార్టీ స్థాపన సందర్భమూ.. రెండూ ఒకేలాంటి సామాజిక అవసరం అనే సమీకరణ చెప్పే ప్రయత్నం చేశారు.
టీడీపీ, జనసేన పార్టీల పునాదుల మధ్య పోలికే అసంబద్ధమైంది. తెలుగుదేశం ఏర్పాటు సమయంలో ఆంధ్రులది ఆత్మ గౌరవ సమస్య. ఒక రాష్ట్ర ప్రజల ఉనికికి సంబంధించి అంశం అది. కానీ, జనసేన పార్టీ స్థాపన వెనక అంతటి అవసరం ఎక్కడుంది..? ప్రజల నుంచి ఆ స్థాయి ప్రోద్బలం ఏది..? ప్రస్తుతం ఆంధ్రాలో అసలు సమస్య అభివృద్ధి ఆగిపోవడం. తెలంగాణ విభజన జరిగిపోయింది… దాన్ని మార్చలేం! కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాలేదు, సాయం అందలేదు… దీన్ని మార్చుకోగలం. ఇదీ ప్రస్తుతం ఏపీ ప్రజలకు ఉన్న స్పష్టత. భావేద్వేగాల కంటే భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తున్న సమయం ఇది. ఇలాంటప్పుడు సెంటిమెంట్ కోసం పవన్ ప్రయత్నాలు మొదలుపెట్టడం ఎంతవరకూ సరైంది..?