ప్రతిఏడాది ఆగష్టు 15న గవర్నర్ రాజ్‌భవన్‌లో ఎట్హౌం పేరిట కార్యక్రమం నిర్వహించి రాజకీయ అధికార అనధికార ప్రముఖులను కలుసుకోవడం ఆనవాయితీ. వేర్వేరు పార్టీలకు రంగాలకూ చెందిన వారు ఇక్కడ చేరతారు గనక ఆసక్తికరంగా వుండటం కద్దు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు , కెసిఆర్ ఈ ఎట్హౌంకు వస్తారా రారా వస్తే ఒకరే వస్తారా ఇద్దరూనా ఇలాటివి అదనపు ఆకర్షణలుగా మారాయి. రాజ్‌భవన్ వేడుకలకు ఇద్దరూ వచ్చిన ఇద్దరూ రాని సందర్భాలున్నాయి. ఇది గవర్నర్ పదవీ కాలం ముగింపుగా భావిస్తున్నారు గనక ఈ సారి ఇద్దరూ వచ్చినట్టున్నారు. అయితే వేడుక తర్వాత కూడా ఉభయులూ గవర్నర్‌తో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారనీ, పరస్పర సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నిర్ణయించుకున్నారని సమాచారం వచ్చింది. అయితే ఇలాటి కథలు చాలా సార్లు వింటున్నవే. వివాదాలూ నడుస్తూనే వున్నాయి. చాలా స్వల్పంగా తప్ప పెద్ద పరిష్కారాలు రాలేదు. ఈ సమావేశం కూడా ఏమంత సంచలన మార్పులు తెచ్చేది వుండదు.
పోతే ఈ సారి నటుడు జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ రాక, రాజకీయ హేమాహేమీలతో వేదిక పంచుకోవడం పెద్ద ఆకర్షణగా మారింది. అప్పటి సందర్భాన్ని బట్టి కొందరని కొత్తగా ఆహ్వానించడం, జాబితాలో చేర్చడం జరుగుతుంటుంది. లేక వారైనా తీరికను బట్టి కొత్తగా రావడమూ జరగొచ్చు. ఉదయం జాతీయ జెండా ఎగరేసి ఉపన్యాసమిచ్చిన పవన్ రాజ్‌భవన్‌కూ వచ్చారంటే రాజకీయాలను తీవ్రంగా తీసుకుంటున్నట్టు లెక్క. తాము తెలంగాణలోనూ పోటీ చేస్తామని ఆయన ప్రకటించారు. అది ఎలాగూ అప్రధానమే గనక ఆంధ్ర ప్రదేశ్‌లో ఏం చేస్తారన్నదే అందరినీ ఆలోచింపచేస్తున్నది.
ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం కలిగించి ఆగష్టు సంక్షోభం అన్న పదానికి అంకురార్పణ చేసిన 1984 ఆగష్టు సంక్షోభం, ఎన్టీఆర్‌కు వెన్నుపోటు ఎట్హౌం దగ్గరే మొదలు కావడం విశేషం.