సొంతంగా కష్టపడిన డబ్బులు రూ. 30 కోట్లు ప్రజలకు ఇవ్వగలనని.. కానీ ప్రజలు అధికారం ఇస్తే వారి కోసం రూ లక్షల కోట్లు ఖర్చు చేస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. సత్తెనపల్లిలో కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహించారు. 280 మందికిపైగా ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ. లక్ష చొప్పున పరిహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ప్రబుత్వంపై విరుచుకుపడ్డారు.
తాను ముఖ్యమంత్రి కావాలని తాను కోరుకుంటే జరగదని.. మీరు కోరుకోవాలని ప్రజలనుద్దేశించి పవన్ అన్నారు. అధికారం చూడని కులాలను అందలం ఎక్కిస్తానన్నారు. జనసేనకు అధికార పీఠం అందిస్తే అవినీతి రహిత పాలన అందిస్తామన్నారు. బాధ్యతతో చెబుతున్నాను.. తప్పు చేస్తే చొక్కా పట్టుకుని అడగాలని ప్రజలకు సూచించారు. ప్రభుత్వం మారకపోతే ఏపీ అంధకారంలోకి పోతుందన్నారు.
వైసీపీ అధికారంలోకి రాకుండా చూసుకునే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. తాను ఇంతకు ముందు చెప్పినట్లుగా వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని స్పష్టం చేశారు. బీజేపీ, టీడీపీకి అమ్ముడుపోయేవాడిని కాదని.. వైసీపీ నేతల్లా పెన్షన్ల సొమ్మును దిగమింగేవాడిని కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారబోతోందని స్పష్టం చేశారు. 2014లోలా తాము కూటమిలా ఉండి ఉంటే వైసీపీ గెలిచేది కాదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని దింపేందుకు వ్యతిరేక శక్తులను ఏకం చేస్తానని ప్రకటించారు.
అంబటి రాంబాబుపై పవన్ విరుచుకుపడ్డారు. ఆయన కాపుల గుండెల్లో కుంపటి అన్నారు. పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారో తెలియని ఆయనొక మంత్రా అని ప్రశ్నించారు. తాను వారానికి ఓసారి వస్తూంటేనే తట్టుకోలేకపోతున్నారని..కాపు నేతలతో పచ్చి బూతులు మాట్లాడిస్తున్నారని మండిపడ్డారు. కాపు కులాన్ని అడ్డు పెట్టుకుని కొందరు ఎదుగుతున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం చిల్లర వేషాలు వేస్తోందన్నారు. వైసీపీ నేతల అరాచకాలు తగ్గాల్సి ఉందన్నారు. సభ పెట్టుకుంటే పోలీసులు మాకు అనేక హెచ్చరికలు చేశారని.. మాకిచ్చిన హెచ్చరికల్ని పోలీసులు వైసీపీ నేతలకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. తనను మొక్కే కదా అని పీకేస్తే.. మళ్లీ లేస్తానన్నారు.
వారాహి వాహనంపై యాత్ర ఎలా చేస్తారో చూస్తానంటూ వైసీపీ నేతలు చేసిన విమర్శలను కూడా పవన్ కల్యాణ్ తిప్పి కొట్టారు. ఎలా ఆపుతారో చూస్తానని హెచ్చరించారు. వారాహితో ఏపీలో తిరుగుతా, దమ్ముంటే అడ్డుకునే ప్రయత్నం చేయమని సవాల్ చేశారు.
సత్తెనపల్లి నియోజకవర్గంలోని ధూళిపాళ్ల గ్రామంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పోలీసులు ఆంక్షలు పెట్టినా పెద్ద ఎత్తున జనసైనికులు హాజరయ్యారు.