జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుమలలో బస చేశారు. కాలి నడక ద్వారా తిరుమల చేరుకున్న ఆయన హంపీ మఠంలో మూడు రోజులు బస చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ మూడు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎవరికీ అందుబాటులో ఉండరని… పూర్తిగా… ధ్యానంలో మునిగి ఉంటారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. సుదీర్ఘమైన రాజకీయ యాత్ర చేసే ముందు మానసిక ప్రశాంతత కోసం… నిర్మలమైన మనస్సు కోసం పవన్ కల్యాణ్ హంపీ మఠంలో ధ్యానం చేస్తున్నారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత జాపాలిలో హనుమంతుడ్ని దర్శించుకుని…బస్సు యాత్ర షెడ్యూల్ను ప్రకటిస్తారట..
మీడియాపై పవన్ కల్యాణ్… నేరుగా యుద్ధం ప్రకటించినప్పటి నుంచి.. జనసేన వర్గాలు… అధికారిక ప్రకటనలేమీ జారీ చేయడం లేదు. అత్యవసరమైతే తప్ప… కొన్ని ప్రెస్నోట్లను సోషల్ మీడియాలో ఉంచుతున్నారు. ప్రధానమైన టీవీ చానళ్లను పవన్ కల్యాణ్ బహిష్కరించినట్లుగా ఆ పార్టీ వ్యవహారశైలి ఉంది. దానికి తగ్గట్లుగానే ఆయా చానళ్లు కూడా… జనసేన కార్యకలాపాలపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. గతంలో ఇచ్చినంతగా ప్రచారం ఇవ్వడం లేదు. ఈ కారణంగా… జనసేన తదుపరి కార్యాచరణపై… చాలా వరకు ప్రజల్లో స్పష్టత లేకుండా పోయింది. పదిహేనో తేదీ నుంచి బస్సు యాత్ర అంటూ జనసేన వర్గాలు లీకులు ఇచ్చినప్పటికీ.. ఇంత వరకూ క్లారిటీ ఇవ్వలేదు. పదకొండో తేదీలోపు ప్రజల్లోకి వెళ్లే తన కార్యాచరణ ప్రకటిస్తానని పవన్ స్వయంగా చెప్పినా… అలా చేయడంలో విఫలమయ్యారు.
బస్సు యాత్ర విజయవంతం కోసం.. తిరుమలలో మూడు రోజుల పాటు పవన్ యజ్ఞం చేయబోతున్నారని.. అంతా త్రివిక్రమ్ శ్రీనివాస్ సలహాల మీద నడుస్తున్నారని కొంత మంది ప్రచారం చేస్తున్నారు కానీ… తిరుమలలో మఠాల్లో కూడా ప్రైవేటు వ్యక్తుల కోసం యజ్ఞాలను అనుమతించరు. ప్రస్తుతం తన ప్రతి అడుగుపై.. అటు టీడీపీ ఇటు వైసీపీ కళ్లు ఉన్నందున.. పవన్ ఈ వివాదాస్పద నిర్ణయం తీసుకోకపోవచ్చు. ఆంజనేయుని స్వామి సాక్షిగా షెడ్యూల్ ప్రకటించి నేరుగా బస్సుయాత్రకు వెళ్తారని..ఇప్పటికైతే జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఎక్కడి నుంచి బస్సుయాత్ర అనే విషయంలో మాత్రం కొంత మంది ఇచ్చాపురం అంటున్నారు… మరికొంత మంది చిత్తూరు పేరు చెబుతున్నారు. ఈ విషయంలో పవన్ కల్యాణ్ తుది నిర్ణయం తీసుకోలేకపోయిట్లు తెలుస్తోంది. మొత్తానికి ఇప్పటికైతే పవన్ కల్యాణ్ తిరుమలలో ఉన్నారు. మూడు రోజుల పాటు ఆజ్ఞాతంలో గడుపుతారు. ఆ తర్వాతే…. అన్నింటిపైనా క్లారిటీ ఇవ్వనున్నారు.