జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ సర్కారుపై మరోసారి విమర్శలు గుప్పించారు. ప్రజా పోరాట యాత్రలో భాగంగా ఆయన శ్రీకాకుళం జిల్లా పాలకొండలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… తెలుగుదేశం ప్రభుత్వం సంపూర్ణ అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ ఏమూలకు వెళ్లినా రెండే వినిపిస్తున్నాయన్నారు. ఒకటీ భూకబ్జాలు, రెండు ఇసుక దోపిడీ అన్నారు. ప్రాజెక్టులకు ఇవ్వడానికి ప్రభుత్వ దగ్గర డబ్బుల్లేవుగానీ, ఇసుక మాఫియా దోచుకోవడానికి డబ్బులున్నాయన్నారు. ప్రజల కనీస అవసరాల గురించి ఆలోచించకుండా దోపిడీ జరుగుతోందని పవన్ దుయ్యబట్టారు.
ఉమ్మడిగా తిని ఒంటరిగా బలవాలంటే కుదరదని టీడీపీకి చెప్తున్నా అన్నారు. తెలుగుదేశం అంటే తెలుగు ప్రజలు అనీ, తెలుగుదేశం పార్టీ ప్రజలు మాత్రం అనుకోవద్దని విజ్ఞప్తి చేశారు! ప్రజల బాగోగులు తనకు అవసరమనీ, అందుకే టీడీపీకి మద్దతు ఇచ్చినా ఆ పార్టీ నుంచి ఒక్క రూపాయిగానీ, ఒక మాట సాయంగానీ తాను తీసుకోలేదన్నారు. టీడీపీకి తాను మద్దతు ఇచ్చినందుకు బహుమతిగా కరెంటు ఆపి తనపై దాడి చేయించారని ఆరోపించారు. తాను ఏపీ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తుంటే… దానికి తూట్లు పొడిచేలా టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.
ఇక, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నాలుగు దశాబ్ధాల రాజకీయానుభవం గురించి కూడా పవన్ మాట్లాడారు. ఆయన మాట్లాడితే నలభయ్యేళ్ల అనుభవమంటారు, కానీ స్థానికంగా ఒక ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారనీ, అదీ మన దుస్థితి అని పవన్ విమర్శించారు. నాలుగు దశాబ్దాల అనుభవం ఉంటే సరిపోదనీ, దాంతో ప్రజలకు ఏం చేస్తారనేది ముఖ్యమన్నారు. చంద్రబాబు నాయుడు నాలుగు దశాబ్ధాల అనుభవం ఇసుక మాఫియా చేయడానికి పనికొచ్చిందన్నారు! కానీ, ఒక తోటపల్లి రిజర్వాయరు పూర్తి చేయలేకపోయిందన్నారు. ఇక, ఉత్తరాంధ్ర వెనకబాటుతనం గురించి మాట్లాడుతూ… అభివృద్ధి అంతా అమరావతి చుట్టూ కేంద్రీకృతం చేస్తూ, ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని పవన్ ఆరోపించారు. రాష్ట్ర ఖజానాలో సొమ్మంతా అమరావతికే పెట్టుబడిగా వెళ్తోందన్నారు. టీడీపీ ప్రభుత్వం ఉత్తరాంధ్రకు ద్రోహం చేస్తోందనీ, వంచనకు గురిచేస్తోందని మండిపడ్డారు.
చంద్రబాబు నాలుగు దశాబ్దాల రాజకీయానుభవంపై వ్యంగ్యం మాట్లాడటం గమనార్హం. అంతటి అనుభవం ఉంది కాబట్టే, నవ్యాంధ్రకు ఇలాంటి నాయకుడు ఉండాలని తాను గతంలో మద్దతు ఇచ్చానని చాలాసార్లు చెప్పారు. ఇప్పుడా అనుభవాన్ని ఈజీగా తీసి పారేశారు. ఈ వ్యాఖ్యల్ని టీడీపీ ఎలా తీసుకుంటుందో చూడాలి.