జనసేన అధినేత పవన్ కల్యాణ్..టీడీపీ అధినేత చంద్రబాబుపై డైరక్ట్ ఎటాక్‌కు దిగిపోయారు. ఉద్దానం సమస్యపై సభ పెడతానంటే…పర్మిషన్ ఇవ్వొద్దని ముఖ్యమంత్రి అధికారుకు చెప్పారని పవన్ ఆరోపించారు. ఉద్దానం కిడ్నీ బాధితులను ఆదుకోవాలంని.. ఆయన చేపట్టిన 16 గంటల రిసార్ట్, 8 గంటల ప్రజల మధ్య దీక్షను ఐదు గంటలకు ముగించారు. ఈ సందర్భంగా.. ఆయన ముఖ్యమంత్రినే నేరుగా టార్గెట్ చేశారు. చంద్రబాబు అప్పులు చేసి ఆడంబరాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్దానం బాధితులకు సాయం చేయడానికి చేతులు రాలేదు.. కానీ ప్రత్యేక విమానాల్లో విదేశాలకు వెళ్లీ ఖరీదైన హోటల్లో ఉండటానికైతే నిధులు ఉంటాయా అని విమర్శలు గుప్పించారు. నిధులు లేకపోతే.. రూ.2 వేల కోట్లు పుష్కరాలకు ఎలా ఖర్చు చేశారని ప్రశ్నించారు.
ఉద్దానం ప్రాంతంలో పదేళ్ల కాలంలో 20వేలమంది చనిపోయారని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. ఇక్కడ కూడా పవన్ కల్యాణ్ కులాల ప్రస్తావన తెచ్చారు. అభివృద్ధి రెండు కులాల గుప్పిట్లోనే ఉందన్నారు. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాల్సిందేనన్నారు. 20వేల మంది కిడ్నీ బాధితులను గుర్తిస్తే.. కేవలం 1000మందికే డయాలసిస్ చేస్తున్నారని పవన్ చెప్పారు. కానీ కిడ్నీ రోగులందరికీ.. డయాలసిస్ అవసరం ఉండదన్న విషయాన్ని మర్చిపోయారు. అయితే ప్రధాని మోదీని వెనుకేసుకొచ్చేందుకు పవన్ ప్రయత్నించారు. చంద్రబాబుపై కోపంతోనే ప్రధాని… ఏపీని పట్టించుకోవడం లేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అవసరమే కానీ.. ఏదో రూపంలో నిధులివ్వాలని డిమాండ్ చేశారు.
పవన్ కల్యాణ్ దీక్ష విరమణకు ముందే చంద్రబాబు.. ఉద్దానం కిడ్నీ రోగులకు సమస్యలపై సమీక్ష చేశారు. ప్రస్తుతం ఉద్దానంలో 13 వేల మందికి క్రమం తప్పకుండా చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు.
ప్రతి 15రోజులకు నెఫ్రాలజిస్ట్ ద్వారా వైద్య సేవలు అందుతున్నాయన్నారు. పలాస, సోంపేట, పాలకొండ, టెక్కలిలో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేశామనన్నారు. రూ.17కోట్లతో 7 ఆర్వో సెంటర్లు ఏర్పాటు చేశాం చంద్రబాబు ప్రకటించారు. పనిచేసేవాళ్లను విమర్శించి జనంలోకి ఏం సంకేతాలు పంపుతారని పవన్ కల్యాణ్‌నుద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. కిడ్నీ రోగులకు పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనని చంద్రబాబు గుర్తు చేశారు.