రాజకీయ పార్టీ అధినేతగా పవన్ కల్యాణ్.. మీడియా ప్రాధాన్యం ఏమిటో గుర్తించలేకపోయారా..? మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తాన్ని ఒకే సారి టార్గెట్ చేసుకుని ఏం సాధించబోతున్నారు..? బాయ్ కాట్ చేయాలంటూ ఇచ్చిన పిలుపుతో… తనకు కానీ..జనసేన పార్టీకి కానీ వచ్చే లాభం ఏమైనా ఉంటుందా..?. ఏమీ ఉండదు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం ఆవేశంలో మీడియాతో లొల్లి పెట్టేసుకున్నారు.
పవన్ కల్యాణ్ కు ఎలాంటి సమాచారం అందిందో కానీ… టీవీ నైన్, టీవీ ఫైవ్, ఏబీఎన్ లపై పూర్తి స్తాయిలో ఎటాక్ చేశారు. తర్వాత ఈ జాబితాలో మహా టీవీని కూడా చేర్చారు. దీంతో ప్రధాన టీవీ చానళ్లన్నింటితోనూ పవన్ వైరం పెట్టుకున్నట్లయింది. వీటిలో నేరుగా ఆరోపణలు గుప్పించిన రెండు చానళ్లు పవన్ పై పరువు నష్టం కేసులు వేసేందుకు సిద్ధమవుతున్నాయి. రాజకీయ పార్టీ అధినేతగా ప్రజల్లోకి వెళ్లాలనుకుంటున్న ఈ పరిస్థితి ఇబ్బందికరమే.
నిజానికి శ్రీరెడ్డి ఇష్యూ నెల రోజుల్నించి నడుస్తోంది. టీఆర్పీల గేమ్ లో పండిపోయిన టీవీ నైన్..ఈ ఇష్యూని అలాగే తీసుకుంది. కానీ ఆర్జీవీ ఎంటరయిన తర్వాత పరిస్థితి మారిపోయింది. అర్జున్ రెడ్డి సినిమాతో పాపులరైపోయిన తిట్టు.. మొత్తం దశను మార్చింది. అది పవన్ కు మీడియాకు మధ్య సమరంగా మారిపోయింది.
పవన్ కల్యాణ్ సినిమా స్టార్ కాబట్టి.. సహజంగానే ప్రజల అటెన్షన్ ఉంటుంది. అందుకే టీవీ చానళ్లు కూడా..ఆయన పార్టీ కార్యక్రమాలకైనా మంచి కవరేజ్ ఇస్తూంటాయి. కానీ ఇక ముందు నుంచి ఈ పరిస్థితి ఉంటుందా అంటే అనుమానమే. పవన్ కల్యాణ్ తెంపరి తనం.. మీడియాకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఏబీఎన్ చానల్ పై దాడి… బాయ్ కాట్ పిలుపుల కారణంగా.. మీడియాలోని అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. వీలైనంత త్వరగా పవన్ మీడియాతో మళ్లీ సన్నిహిత సంబంధాలు నెలకొల్పుకుంటే..జనసేన రాజకీయ భవిష్యత్ కు కూడా మంచిదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.