ఏపీలో అవినీతి పెరిగిపోతోందనీ, ఈ విషయంలో రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో ఉందంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా, ముఖ్యమంత్రి కుమారుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ మీద కూడా అవినీతి ఆరోపణలు చేశారు. ‘మీ అబ్బాయి అవినీతి కనిపించడం లేదా, కనిపించే కామ్ గా ఉంటున్నారా’ అంటూ సీఎంని ప్రశ్నించారు. దీంతో, ఏ ఆధారాలతో లోకేష్ మీద ఈ స్థాయి ఆరోపణలు చేశారా అనే చర్చ తీవ్రంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ ఏమంటారంటే… ‘అవి అందరి దృష్టిలో ఉన్నవే, నేను చెప్పడం వల్ల యాంప్లిఫై అయ్యుండొచ్చు’ అనీ..!
లోకేష్ పై అవినీతి ఆరోపణలు చేసేటప్పుడు ఆధారాల్లాంటివి ఉండాలి కదా అన్నట్టుగా ప్రశ్నిస్తే దానికి ఇలా బదులిచ్చారు. ‘అందరి దృష్టిలో ఉన్నవే, నేను ఇంకోసారి చెప్పాను. నేను కూడా అనకపోతే ఏమైపోతుందంటే.. అందరి దృష్టిలో ఉండి, నీ దృష్టిలో ఎందుకు పడలేదనీ ప్రజల నుంచి ఎదురుదాడి ఉంటుంది. కాబట్టి, కచ్చితంగా ఆ మాట అనాల్సిన పరిస్థితి’ అని పవన్ చెప్పారు. లోకేష్ ఎవరో తనకు తెలీదని శేఖర్ రెడ్డి అన్నారనే ప్రస్థావన వచ్చేసరికి.. ‘ఆరోజు నేను చెప్పినప్పుడు, ఇలాంటి కూడా ఉన్నాయి.. ఓసారి చూసుకోండని చెప్పాను’ అన్నారు.
అంటే, ఆధారాలు ఉన్నాయని మంత్రి లోకేష్ మీద పవన్ ఆరోపణలు చెయ్యలేదన్నమాట..! అందరూ అంటున్నారు కాబట్టి, తాను కూడా అనకపోతే… తనను ఎవరో ఏదో అనుకుంటారనే ఉద్దేశంతో అనాల్సి వచ్చింది పవన్ చెప్పడం ఎంతవరకూ కరెక్ట్..? ఎవరో అన్నారనిచెప్పి, అవినీతి ఆరోపణలు చేయడం సరైందా..? ఒక భారీ బహిరంగ సభలో పవన్ కల్యాణ్ లాంటి ఒక నాయకుడు, ప్రముఖ సినీ నటుడూ.. ముఖ్యమంత్రి కుమారుడి అవినీతి అదీఇదీ అని మాట్లాడేసి, ఇప్పుడు తీరిగ్గా ‘అబ్బే, ఇలాంటివి ఉన్నాయేమో చూసుకోండ’ని మాత్రమే చెప్పాను అంటే ఎలా..? ఎవరో ఏదో అనుకోవడానికీ… పవన్ కల్యాణ్ అనడానికి ఉన్న తేడా పవన్ కి తెలియడం లేదేమో..? ఒక రాజకీయ నాయకుడిగా.. ఎవరిపైన అయినా ఏదైనా అవినీతి ఆరోపణలు చేయాలనుకుంటే, దానికి సంబంధించిన కొన్నైనా ఆధారాలు ఉండాలి కదా..! వాటితో మాట్లాడాలి. అంతేగానీ, ఇలా గాలివాటంగా మాట్లాడేస్తుంటే అపరిపక్వతను బయటపెట్టుకున్నట్టే అవుతుంది కదా..!