చిరంజీవిలా మెలికలు తిరిగిపోయే స్టెప్పులు వేయడు – కానీ.. కాళ్లు అలా కదిపినా చాలు – అభిమానులు ఊగిపోతారు.
రజనీకాంత్ లా – బబుల్ గమ్ ఎగరేయడాలూ, కళ్లజోడు వెనక్కి తిప్పి పెట్టుకోవడాలూ చేయడు. చేయి తీసుకెళ్లి మెడమీద కాస్త రుద్దుతాడు అంతే. థియేటర్లు దద్దరిల్లిపోతాయి.
కమల్ హాసన్ లా నంది అవార్డులు, ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలూ అందుకునేంత అద్భుతమైన నటన ప్రదర్శించలేదు. నిలబడి నాలుగు డైలాగులు చెబితే చాలు – ఈలలూ, కేకలూ, వన్స్మోర్లూ.
ఎందుకంటే ఆ కటౌట్ అలాంటిది. ఆ పేరులో ఉన్న పవర్ అంతటిది.
తెరపై హీరోయిజం చూపించి అభిమానుల్ని సంపాదించుకున్నాడు. తన సింప్లిసిటీతో, నిజాయితీతో.. ఆ అభిమానుల్నే అనుచరులుగా, భక్తులుగా మార్చుకున్నాడు. పవన్ కల్యాణ్ అంటే ఓ పేరు కాదు… పూనకంలా మారిపోయింది. తన అడుగే ప్రభంజనం అయిపోయింది.
సినీ పరిశ్రమలో హీరోలు చూపించే – ఓవర్ ది బోర్డ్ విన్యాసాలు పవన్ లో వెదికినా కనిపించవు. విలాసవంతమైన జీవితానికి పవన్ ఎప్పుడో దూరం.
ఫామ్ హౌస్, మట్టి కుండలు, మడత మంచాలూ, ఆవులూ – గేదెలు. సెట్ వదిలితే పవన్ జీవితం ఇదే.
ఇదేదో ఇప్పటికిప్పుడు పవన్ లో వచ్చిన మార్పు కాదు. ముందు నుంచీ అంతే. అన్నయ్య మెగా స్టార్. ఇంట్లో అన్నీ రాజభోగాలే. కానీ.. ఇవేం తనకి కికి ఇవ్వలేదు. మొక్కల్లో, నోరు లేని జంతువుల్లో… జీవితాన్ని వెదుక్కున్నాడు. అన్నీ ఉన్నా- మనసులో ఏదో అసంతృప్తి. నలుగురిలో కలవాలంటే భయం. మాట్లాడాలంటే బెరుకు. సిగ్గు. ఇన్ని ఉన్నవాడు.. నటుడిగా నిలబడతాడా? అనే అనుమానాలు. ఇవన్నీ తొలి సినిమాకే దూరం చేసేశాడు. సుస్వాగతం, తొలి ప్రేమ – వీటితో యువతరం మనసుల్ని గెలిచాడు. బద్రి, ఖుషి సినిమాలతో – బాక్సాఫీసు దగ్గర ప్రభంజనం చూపించాడు. ప్రతీ సినిమాలోనూ ఏదో ఓ మార్క్. తనదంటూ ఓ స్టైల్. అందుకే… ఫ్యాంటు మీద ఫ్యాంటు వేసినా – అదేం ఎబ్బెట్టుగా కనిపించలేదు.
వరుసగా ఎన్ని ఫ్లాపులొచ్చినా – ఆ క్రేజ్ తగ్గలేదు.
యేడాదికో, రెండేళ్లకో ఓ సినిమా చేసినా – అభిమానుల హుషారు తగ్గలేదు.
నా సినిమా చూడండి అని చెప్పడు ఫ్లాప్ అయిన సినిమాకి పనిగట్టుకుని ప్రచారం చేయడు. ఆ మాటకొస్తే.. మీడియా ముందుకు రావడానికి, తన సినిమా గురించి చెప్పుకోవడానికీ అస్సలు ఇష్టం ఉండదు.
రాజకీయాల్లోకి వెళ్లి – ఘోరంగా ఫెయిల్ అయ్యాడు.
అయితే ఏంటి? రెండేళ్ల గ్యాప్ తరవాత… ఓ సినిమా చేస్తున్నాడంటే.. మళ్లీ అభిమానుల ఉత్సాహం మొదలైపోయింది. పవన్ పుట్టిన రోజు వస్తోంటే ట్విట్టర్లో ట్రెండు మార్మోగిపోతోంది. పవన్ పేరుతో ఎన్ని సేవా కార్యక్రమాలో. అదీ.. పవన్ కల్యాణ్ అంటే!
హీరోగా అభిమానిస్తే – ఫ్లాపులొచ్చినప్పుడు ఆ క్రేజ్ తగ్గొచ్చు.
పవన్ కల్యాణ్ హీరో కాదు. అంతకు మించి. అందుకే… ఆ అభిమాన ధనం తరగదు. కరగదు.
హ్యాపీ బర్త్ డే వకీల్ సాబ్.. జీతే రహో!