ఒక మహా వృక్షం నీడలో మరో చెట్టు ఎదగదు. వికసించలేదు. అయితే ఈ నియమాన్ని బ్రేక్ చేసి సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన స్టార్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మెగాస్టార్ అనే మహా వృక్షం నీడలో పవర్ స్టార్ అనే మరో మహా వృక్షంగా వికసించారు పవన్ కళ్యాణ్. పవన్ కు మెగా బ్రదర్ ట్యాగ్ తో ఈజీగానే వెండితెర ఎంట్రీ దొరికేసింది. అప్పటికే ఒక మెగా బ్రదర్ నాగబాబు హీరోగా లక్ పరీక్షించుకొని నిర్మాతగా మారిపోయారు. ‘అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి’ తో ఈసారి పవన్ వంతు. చిరంజీవి చిన్న తమ్ముడనే క్యురియాసిటీ. అన్నయ్య పేరు నిలబెడతాడా? చెడగొడతాడా ? అనే చర్చ. కట్ చేస్తే ..ఈ రోజు పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఎవరెస్ట్. ఈ ఇమేజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అభిమానులు ఆయనకు గుండెల్లో గుడి కట్టేశారు. అయితే ఇదంతా సింగల్ నైట్ లో వచ్చేయలేదు. తన తొలి సినిమా వరకే అన్నయ్య చేయి పట్టుకున్న పవన్.. తర్వాత తన నడకే తనే నడిచారు.
‘తొలిప్రేమ’తో ప్రేక్షకుల ప్రేమికుడిగా మారిపోయారు పవన్ కళ్యాణ్. ప్రేమ కధల్లో ఇప్పటికీ తొలిప్రేమ ట్రెండ్ సెట్టర్. తర్వాత ‘తమ్ముడు’తో ఇంట్లో మనిషి అయిపోయారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చేసిన స్టంట్స్, ఒక తెలుగు సినిమాలో పూర్తిగా ఇంగ్లీష్ లిరిక్స్ తో సాగిన పాట సరికొత్త ట్రెండ్ ని సెట్ చేస్తాయి. ‘ఖుషి’తో హోల్ సెల్ గా యువత హృదయాల్ని కొల్లగొట్టేశారు. ఖుషి సినిమా పవన్ కళ్యాణ్ ఒకేసారి వందమెట్లు ఎక్కించేసింది. జస్ట్ కోపంగా మెడని రుద్దుకున్న మేనరిజం .. పవన్ కళ్యాణ్ సిగ్నేచర్ గా నిలిచిపోయింది. ”ఖుషి’ సినిమా ఎంతపెద్ద విజయం సాదించిందంటే .. ఈ సినిమా తర్వాత అభిమానుల అంచనాలు పెరిగిపోయి.. మరో హిట్ ఇవ్వడానికి దాదాపు ఎనిమిదేళ్ళు పట్టింది. ఖుషి తర్వాత చేసిన జానీ, గుడుంబా శంకర్ , బాలు, బంగారం, అన్నవరం.. నిరాశ పరిచాయి. అయితే ‘జల్సా ‘తో అభిమానులు కోరుకుంటున్న విజయం దొరికిపోయింది. ఇక అక్కడి నుండి పవన్ మానియాకి మరో స్థాయికి వెళ్ళిపోయింది. జల్సా తర్వాత వచ్చిన పులి, పంజా సినిమాలు నిరాస పరిచినా.. గబ్బర్ సింగ్.. అత్తారింటికి దారేది.. సినిమాలు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసేశాయి.
‘నేను ట్రెండ్ పాలో అవ్వను సెట్ చేస్తాను’. గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ చెప్పిన డైలాగ్ ఇది. ఇది సినిమా డైలాగ్ కాదు. నిజంగానే పవన్ కళ్యాణ్ ట్రెండ్ సెట్టర్. పవన్ కళ్యాణ్ ఏనాడూ ట్రెండ్ పాలో అవ్వలేదు. ట్రెండ్ సెట్ చేసుకుంటూ వెళ్లిపోయారు. పెద్ద చిన్నా అనే లెక్కలు వేసుకోకుండా పూరి జగన్నాధ్, కరుణాకర్ లాంటి యువ దర్శకులకు అవకాశాలు ఇవ్వడం. తన సినిమాల్లో పూర్తిగా హిందీ, ఇంగ్లీష్ పాటలు పెట్టడం, తన సినిమాల్లో జానపదాలని పాటలుగా వాడటం, బాలు, గుడుంబా శంకర్ లాంటి సినిమాల్లో పవన్ కళ్యాణ్ వాడిన డబల్ ప్యాంట్ లాంటి డిఫరెంట్ కాస్టూమ్స్, జానీ లాంటి రిస్క్ కధని రాసుకొని దానికి దర్శకత్వం వహించడం, సినిమా అపజయం పాలైతే రేమ్యునిరేషన్ వెనక్కి ఇచ్చేయడం, సినిమా నిర్మాణం చేపట్టడం, స్క్రీన్ ప్లేయ్ రాయడం.. ఇలా అడుగడుగునా పవన్ కళ్యాణ్ ట్రెండ్ సెట్టరే.
పవన్ కళ్యాణ్ కు ఇప్పుడున్న ఇమేజ్ అంతా కేవలం సినిమాల ద్వారానే రాలేదు. పవన్కల్యాణ్ది భిన్నమైన వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వమే అభిమానులను మరింత దగ్గర చేసింది. ఒక హీరోగానే పవన్ కళ్యాణ్ ను ప్రేక్షకులు అభిమానించుంటే ఆయన హీరో రేసింగ్ లో వెనకపడిపోయేవారే. కాని పవన్ విషయంలో అది జరగలేదు. ఆయన వ్యక్తిత్వం ఆయన్ని నిలబెట్టింది. హిట్లకు పొంగిపోలేదు. ఫ్లాపులకు కుంగిపోలేదు. అసలు హిట్టు ఫ్లాపు ఆయన విషయంలో లెక్కలోకి రాలేదు. ఆయన అభిమానులూ అంతే. ఆయన్ని సినిమా స్టార్ కంటే మించి అభిమానించారు. పవన్ హ్యుమనిజానికి ఫిదా అయిపోయారు. ఆ హ్యుమనిజమే పవనిజమైయింది.
పొలిటికల్ జర్నీ మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్.. కొన్నాళ్ళు సినిమాలకి దూరంగా జరిగారు. కానీ పవన్ కళ్యాణ్ ని వెండితెర పై ఆరాధించే అభిమానులు మాత్రం ఆయన్ని మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై చూడలని బలంగా కోరుకున్నారు. అభిమానులు కోరిక తీరింది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు మళ్ళీ సినిమాలతో బిజీగా వున్నారు. వకీల్ సాబ్ తో సాలిడ్ ని హిట్ ని అభిమనులకు అందించిన పవన్ కళ్యాణ్ .. ఇప్పుడు మరో మూడు సినిమాలు సెట్స్ పై వుంచారు. బహుసా పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఒకేసారి మూడు సినిమాలు సెట్స్ పై వున్న సందర్భాలు లేవు. అభిమానులకి కావాల్సింది కూడా ఈ వేగమే. పవన్ కళ్యాణ్ సూపర్ ఫాస్ట్ గా సినిమాలు చేస్తూ మరిన్ని ట్రెండ్ లు సెట్ చేయాలని ఆశిస్తూ…. ఆయనకి మనస్పూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు.