పవన్ కల్యాణ్… ఈ పేరు వింటే చాలు అభిమానులు ఉర్రూతలూగుతారు! మెగాస్టార్ బ్రదర్ గా సినీ రంగంలోకి ప్రవేశించినా… తనకంటూ ఒక శైలీ, తనదంటూ ఒక ప్రత్యేక ముద్రను వెండితెరపై పవన్ కల్యాణ్ వేశారు. ఒక స్టైల్, ఒక పొగరు, ఒక పట్టుదల, ఒక ఆవేశం, ఒక యాటిట్యూడ్… పవన్ లో అభిమానులు చూసుకున్నవి ఇవి. ఇదంతా నటుడిగా పవన్ సక్సెస్ ట్రాక్. ఇక, నాయకుడిగా కూడా అదే తరహా ఇమేజ్ ను పొందాలని రాజకీయరంగ ప్రవేశం చేశారు. నిజానికి… సినిమాల్లో రిటైర్ అయిపోయి, అవకాశాలు తగ్గిపోయినవారు వేరే రంగాల్లోకి వెళ్తుంటారు. కానీ, సినీ కెరీర్ లో ఉన్నత స్థాయిలో ఉండగానే… రాజకీయాలవైపు వచ్చేశారు పవన్. కోట్ల ఆదాయాన్ని వదలుకుని, ప్రజా సమస్యలపై స్పందించి… నిరంతరం విమర్శలకు గురౌతూ, ఇతర పార్టీల నుంచి రాజకీయ ఎదురుదాడులను తట్టుకుంటూ ప్రజా జీవితంలో నిలవడం అనేది అంత సులువైన పని కాదు. ఆ పని పవన్ కల్యాణ్ చేశారు.
సినిమాలకు గుడ్ బై చెప్పేసి… ‘పవన్ కల్యాణ్ పార్ట్ టైమ్ లీడర్’ అనే విమర్శను పూర్తిగా తుడిచేశారు. జనసేనానిగా జనంలోనే ఉంటున్నారు. ఇక, ఒక నాయకుడిగా ఆయన ప్రభావం ఆంధ్రా రాజకీయాల్లో కీలకమైంది. ఒకదశలో, ఆంధ్రాని కేంద్రం నిర్లక్ష్యం చేస్తుంటే, విభజన హామీలను అమలు చెయ్యకపోతున్న తరుణంలో… ఆంధ్రా ప్రజల ఆవేదనకు, ముఖ్యంగా యువత ఆకాంక్షలకు పవన్ కల్యాణ్ కొన్నాళ్లపాటు గొంతులా నిలిచారు. ‘మీకు మేం కనిపించడం లేదు. మా ఆవేదనా ఆగ్రహం వినిపించడం లేదు. మీరు ఉత్తరాదిలో ఉన్నారు కాబట్టి, కిందనున్న మా దక్షిణాదిని చిన్నచూపు చూస్తున్నారు. ఐ పవన్ కల్యాణ్… జనసేన లీడర్. సీమాంధ్ర ప్రజలతోపాటు నేనూ మీ దృష్టికి వచ్చి తీరతా. హమ్ లడేంగే లడేంగే’ అంటూ ఆవేశంగా ఓ సభలో పవన్ అన్నారు.
ఆయన చదువుకున్న పుస్తకాలు, తెలుసుకున్న మనుషులు, వారు ఆకాంక్షించిన సమాజాన్ని నిర్మించాలనేది పవన్ ఆకాంక్ష. అది జనసేన ద్వారా సాకారం చేస్తానని పవన్ అంటుంటారు. పవన్ లో ఉన్న ముక్కుసూటితనమే ఎక్కువగా కనిపిస్తుంది. ఏ స్థాయి వ్యక్తులపైన అయినా విమర్శలు చేయాలంటే… ఏమాత్రం వెనకాడరు. అది కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా… ప్రధాని అయినా, ముఖ్యమంత్రి అయినా… తాను చెప్పాలనుకున్నది సభాముఖంగా సూటిగా చెప్పేస్తుంటారు. సినిమాల్లో హీరోల పాత్రలు చేసినా… ప్రజాజీవితంలోకి వచ్చేసరికి… ఆ కరిజ్మాను కొనసాగించడం అందరికీ సాధ్యం కాదు. ముఖ్యంగా, రాజకీయాల్లోకి వచ్చాక ఒక సగటు నాయకులుగా మాత్రమే పెద్దపెద్ద తారలు మిగిలిపోయిన చరిత్ర ఉంది! తల్చుకుంటే సొంతంగా ప్రభావంతులుగా నిలవాల్సిన స్థాయి ఉన్నవారు కూడా… చతికిలపడి వెనక వరుసలో నిలబడ్డ సందర్భాలే ఉన్నాయి. కానీ, పవన్ కల్యాణ్ తెర మీద అభిమానులకు ఎలా కనిపించారో.. రాజకీయాల్లో వచ్చాక కూడా ఇప్పటివరకూ అదే స్థాయి ఇమేజ్ ను నిలుపుకున్నారని చెప్పొచ్చు. చాలామందికి ఈ అంశమే పవన్ ను ఎప్పటికీ ప్రత్యేకంగా అభిమానించేలా చేసేది.
ఈరోజు పవన్ కల్యాణ్ జన్మదినం. ఈ ఏడాది పవన్ కల్యాణ్ కు ఎంతో ప్రత్యేకం కాబోతోంది. ఎందుకంటే, జనసేనానిగా ఎన్నికలను ఎదుర్కోబోతున్నారు. సినిమాలను వదులుకుని వచ్చి, తాను కోరుకున్న మార్పు రాజకీయాల ద్వారా తెస్తాన్న నమ్మకంతో జనసేన ఏర్పాటు చేసిన తరువాత.. మొట్టమొదటిసారిగా ఎన్నికలకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేనానికి ఆల్ ద బెస్ట్, పవర్ స్టార్ కి హ్యాపీ బర్త్ డే.