అడుగు అడుగు వేస్తేనే ఎన్ని కిలోమీటర్ల లక్ష్యమైనా చేరుకుంటాం..! ఈ విషయాన్ని తత్వవేత్తలు చెప్పాల్సిన అవసరం లేదు. శాస్త్రవేత్తలు పరిశోధించి వెల్లడించాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికీ ఈ విషయంపై అవగాహన ఉంటుంది. అయితే ప్రయాణం.. రోడ్డు మీదనా .. కెరియర్లోనూ… జీవితంలోనా లేకపోతే తాను ఎంచుకున్న రంగంలోనా అన్నది ముఖ్యం కాదు. ఎక్కడైనా ముందడుగు వేయడమే ముఖ్యం. ఆ విషయం పవన్ కల్యాణ్‌కు తెలియనిదేం కాదు. అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి సినిమాతో చిరంజీవి తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చి అట్టర్ ఫ్లాప్ చూసిన పవన్ .. జీవితంలో అప్పుడే అధంపాతాళానికి వెళ్లాడు. కానీ నిరాశతో అక్కడే ఉండి ఉంటే ఈ రోజు పవర్ స్టార్, జనసేనాని మన కళ్ల ముందు ఉండేవారు కాదు. శ్రమ… పట్టుదల.. అకుంఠిత దీక్షతో పవన్ కల్యాణ్ ఈ స్థాయికి ఎదిగారు. కానీ ఆయన ఎదగాల్సినంత ఎత్తుకు ఎదిగారా? చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నారా ? అంటే సినిమాల కన్నా.. రాజకీయాల విషయంలో అనగాహన లేకుండా ఆయన చేస్తున్న పనులను నిస్సందేహంగా చెప్పుకోక తప్పదు. ఏపీకి దిశానిర్దేశం చేయగల.. ఏపీ ప్రజల బతుకుల్లో మార్పులు చేయగల యువ నేతల్లో పవన్ కల్యాణ్ ఒకరు. ఆయన పుట్టిన రోజు నాడు.. పొగడ్తలు.. శుభాకాంక్షలకే పరిమితం కాకుండా ఆయన ఉన్నతి ఉపయోగపడేలా.. సవరించుకునేలా లోపాలను ఎత్తి చూపడమే ఆయనపై చూపే అభిమానం అనుకోవచ్చు. ఆ ప్రయత్నమే ఇది.
చిరంజీవి తమ్ముడిగా ఎంట్రీ మాత్రమే.. కానీ ఎదిగింది సొంత టాలెంట్‌తోనే !
చిరంజీవి తమ్ముడు కాబట్టి పవన్ కల్యాణ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్‌గా ఉన్నారని చాలా మంది అంటూ ఉంటారు. అదే నిజమైతే నాగబాబు ఎందుకు సూపర్ స్టార్ కాలేకపోయారనేది సింపుల్‌గా అందరికీ వచ్చే ప్రశ్న. నిజం చెప్పాలంటే చిరంజీవి అనే ఇమేజ్ పవన్ కల్యాణ్‌కు బర్డెన్‌గా మారింది. పవన్ మొదటి సినిమా అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి. ఆ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ఆయన ఎదుర్కొన్న పరిస్థితులు.. పరిణామాలు ఆయనకే తెలుసు. ఆయనకు సన్నిహితంగా ఉన్న కొంత మందికి తెలుసు. ఆ సినిమా రిలీజ్ తర్వాత పవన్ కు యాక్షన్ రాదన్నారు. పనికి రాడన్నారు. సినిమాలు చేస్తామని వచ్చిన అందరూ వెనక్కి తగ్గారు. అప్పట్లో పవన్ కల్యాణ్ కెరీర్ అంతమైపోయిందనుకున్నారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం నిరాశలోనుంచే ఫీనిక్స్‌లా ఆలోచనలను పెంచుకున్నాడు. తన సత్తా చూపాలనుకున్నాడు. తొలి అవకాశం అయితే చిరంజీవి బ్రాండ్‌తో వచ్చింది కానీ ఆ తర్వాత మాత్రం ఆయన సొంత టాలెంట్ చూపించారు. వైవిధ్యమున్న కథలతో తెర ముందుకు వచ్చారు. తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి లాంటి వాటి సినిమాలతో యువతలో క్రేజ్ తెచ్చుకున్నారు. అది అంతకంతకు పెరుగుతూ పోయింది. ఆయన ప్రయాణంలో చిరంజీవి బ్రాండ్ వల్ల తొలిఅవకాశం వచ్చింది. కానీ ఆయన నిలదొక్కుకునే వరకూ.. చిరంజీవి ఇమేజ్ను మోయాల్సి వచ్చింది. చిరంజీవిపేరు చెడగొట్టకుండా.. తన కెరీర్‌ను బిల్డ్ చేసుకోవడానికి ఆయన ఎంత కష్టపడి ఉంటారో .. జీవితంలో ఎదగలేని వారు ఎవరూ ఊహించలేరు. సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టుకుని టైమ్ పాస్ చేసేవారు అసలు అంచనా వేయలేరు కూడా !
పార్టీ ప్రకటించి పోటీ చేయకపోవడం పెద్ద బ్లండర్ !
పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదనే మనస్థత్వం పవన్ కల్యాణ్‌ది. వందలు… వేల పుస్తకాలు చదివి విజ్ఞానం ఆయన సొంతం. సామాజిక స్పృహ ఉన్న నేత. వందలు, వేల పుస్తకాలు చదివారు. రాజకీయంగా సమాజానికి ఏదైనా చేయాలనుకునే స్వభావం ఉన్న నేత. అందుకే సోదరుడు ప్రజారాజ్యం పార్టీ పెడితే అందులో యువరాజ్యం బాధ్యతలు తీసుకున్నారు. విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ పదవులు కోరుకోలేదు. ఎక్కడా పోటీ చేయలేదు. కానీ ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం అయిన తర్వాత సైలెంటయ్యారు. కానీ ఆయనలోని రాజకీయ భావాలు కుదురుగా ఉండనీయలేదు. అందుకే జనసేన పార్టీని ప్రారంభించారు. 2014 ఎన్నికలకు ముందు ప్రారంభించి.. తాను అందరి లాంటి రాజకీయ నాయకుడ్ని కాదని.. ఓట్లు చీల్చడం ఇష్టం లేదని చెప్పి పోటీ చేయలేదు. టీడీపీ,బీజేపీ కూటమికి మద్దతిచ్చారు. అక్కడే పెద్ద తప్పు చేశారు. రాజకీయాల్లోకి వస్తే .. ఏదైనా సరే అటో ఇటో తేల్చుకోవాలన్నట్లుగా ఉండాలి. కానీ పవన్ మొదటి అడుగులోనే తప్పు చేశారు. పోటీ చేయడం ఇష్టం లేకపోతే పార్టీ ప్రకటన చేయకుండా ఉండాల్సిందని ఎన్నికలైన తర్వాత పార్టీ ప్రకటన చేసి ప్రజల్లోకి వెళ్లి ఉంటే మంచి ఫలితం వచ్చి ఉండేది. అలా చేసిన తర్వాతైనా పార్టీ విస్తరణకు ప్రయత్నించారా అంటే అదీ లేదు. టీడీపీ-బీజేపీ ప్రభుత్వంతో సఖ్యతగానే ఉన్న ఆయన చివరి ఏడాది విభేధించి కమ్యూనిస్టులు, బీఎస్పీతో కలిసి 2019లో పోటీ చేశారు. కానీ ఆయన రెండు చోట్లా ఓడిపోవడం పెద్ద మైనస అయింది. అదే సమయంలో ఆయన పార్టీ తరపున రాజోలు నుంచి ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలిచారు. జనసేన పార్టీకి నికరంగా ఆరు శాతం ఓట్లు ఉన్నట్లుగా 2019 ఎన్నికలతో తేలింది. ప్రజారాజ్యంతో పోలిస్తే ఈ ఓటు శాతం చాలా తక్కువ. అయితే పవన్ కల్యాణ్ పోరాటయోధుడు. ఓట్లు, సీట్లు రాలేదని ఆయన నిరాశపడలేదు. రాజకీయ పోరాటం సాగిస్తున్నారు. కానీ ఇప్పటికీ ఆయన ఓ పొలిటికల్ ఫోర్స్‌గా మారారా అంటే చెప్పలేని పరిస్థితి. తనకు అండగా ఉండే సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న చోట్ల జనసేన భారీగా ఓట్లు చీలుస్తోంది. కానీ గెలిచేంత వరకూ రావడం లేదు. అక్కడే జనసేన వైఫల్యం చెందింది.
పార్టీ నిర్మాణం ఇప్పటికీ లేకపోవడం ఎవరి తప్పిదం!?
పార్టీ ప్రారంభించి ఎనిమిదేళ్లు అవుతున్నా.. జనసేనకు పూర్తి స్థాయి నిర్మాణం లేకపోవడం పెద్ద మైనస్. పార్టీ కోసం అయినా ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికైనా పవన్ సినిమాలు చేయాల్సి వస్తోంది. దీంతో ఆయన పార్ట్ టైమ్ రాజకీయాలు చేస్తున్నారన్న అభిప్రాయం పెరిగిపోయింది. ఎప్పుడో ఓ సారి సమావేశం పెట్టడం.. లేకపోతే డిజిటల్ క్యాంపెన్ నిర్వహించడంతో సరిపోతోంది. ప్రజా పోరాటాలు పరిమితంగా ఉన్నాయి. అయితే ఆయనపైనా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వేధింపులకు పాల్పడింది. ఆర్థికంగా దెబ్బకొట్టే ప్రయత్నం చేసింది. వ్యక్తిగత దూషణలకూ పాల్పడ్డారు. అయినా పవన్ మాత్రం గీత దాటలేదు. రాజకీయంగానే తేల్చుకుంటానని.. వైఎస్ఆర్సీపీ ఓటమే లక్ష్యంగా పని చేస్తానని ప్రకటించారు. కానీ ఈ విషయంలో పవన్ కల్యాణ్‌కు స్పష్టత ఉందా అంటే.. ఆయనకే లేదని చెప్పాలి. ఓ సారి ఓట్లు చీలనివ్వనని అంటారు. మరోసారి టీడీపీ, వైసీపీలకు ఊడిగం చేయడానికి పార్టీని పెట్టలేదంటారు. అధికారం కోసం రాలేదంటారు. ఇలా అనేక రకాల వ్యాఖ్యలతో పవన్ కల్యాణ్ సీరియస్ నెస్ అంతా రాజకీయాల్లో కనిపించకుండా పోయింది. అయితే ఆయన వెనుక బలమన అభిమానులు ఉన్నారు. వారు అండగా నిలుస్తున్నారు. పవన్ లో క్లారిటీ లేకపోయినా.. తామంతా పవన్ వెనుకే ఉంటామన్న క్లారిటీ వారికి ఉంది. రాజకీయాలన్న తర్వాత ప్రత్యర్థులు విమర్శిస్తారు. వారి వ్యుహాలన్నీ.. పవన్ ను తమకు అనుకూలంగా మల్చుకోవడమే. అనుకూలంగా ఉంటే.. తమకు మద్దతుగా ఉంటేనే కాదు.. పవన్ తో ప్రత్యర్థిని దెబ్బతీస్తే.. తమకు కలిగే లాభం కూడా… పవన్ వల్ల వారికి కలిగేదే. గతంలో అదే జరిగింది. ఇప్పుడు కూడా అదే చేయాలనుకుంటున్నారు. పవన్ కల్యాణ్ ఈ రాజకీయాల్ని గుర్తించగలగాలి.
బలాలు, బలహీనతల్ని పవన్ కల్యాణ్ గుర్తించాలి !
తను ఏదైనా జిల్లాకు వెళ్తే వెంట వచ్చే నాలుగైదు వేల మంది.. సీఎం సీఎం అయితే కొన్ని వందల మందిని చూసి ..లేకపోతే పార్టీ యంత్రాగం తీసే డ్రోన్ షాట్లు చూసి.. తనకు తిరుగులేని బలం ఉందని.. అనుకుంటే అంతకు మించి అమాయకత్వం ఉండదు. రాజకీయాల్లో బలాన్ని పొందడం ఎంత గొప్ప విషయమో.. ఆ బలాన్ని అంతే పకడ్బందీగా వాడుకోవడం కూడా అంతే కీలకం. మనది ప్రజాస్వామ్య దేశం. మెజార్టీ రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. ఓ రాజకీయ పార్టీకి ఇరవై శాతం ఓట్లు ఉన్నా… చట్టసభల్లో ప్రాతినిద్యం లేకపోతే.. ఆ ఇరవై శాతం ఓట్లు వృధా. అంతే కాదు.. తమను నమ్మి ఓట్లేసిన వారి వాయిస్‌ను వినిపించకుండా చేసినట్లవుతుంది. అదే పది శాతం ఓట్లు ఉన్నా సరే.. పది మంది చట్టసభల్లో ఉంటే… ప్రభావం ఎక్కువగా చూపించవచ్చు. ఇక్కడ పది శాతం ఓట్లనే .. ప్రభావ వంతంగా వాడుకోవడం కీలకం. అదే రాజకీయం. పవన్ కల్యాణ్ గుడ్డిగా వెళ్లిపోవడం వల్ల2019లో ఆయన తీవ్రంగా నష్టపోయారు. ఆయన నష్టం వ్యక్తిగతం. ఆయన భరించగలరు. కానీ ఇప్పుడు ఏపీకే తీవ్ర నష్టం జరిగింది. ఆ నష్టం.. ప్రజల బతుకుల్ని ధ్వంసం చేస్తోంది. రాష్ట్రాన్ని దివాలా తీయిస్తోంది. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ కూడా అంగీకరిస్తున్నారు. అందుకే ఈ సారి ఓట్లు చీలనివ్వనని అంటున్నారు. ఈ విషయంలో ఆయన వ్యూహం ఏమిటో తెలియదు కానీ.. రాజకీయంగా ఆయన ఇంకా చాలా డైనమిక్‌గా వ్యవహరించాల్సి ఉందన్నది కీలకం. అదే సమయంలో ప్రజలకు తానున్నానన్న భరోసా కల్పించాలంటే.. ఎక్కువగా ప్రజల్లో ఉండాలని సూచిస్తున్నారు. పవన్ కల్యాణ్.. ఏదైనా సభ నిర్వహిస్తే తర్వాత రెండు వారాలు పార్టీ కార్యక్రమాలు నిర్వహించరు. గత మూడేళ్లుగా ఇదే జరగడం వల్ల ఆయన అందుబాటులో ఉంటారన్న నమ్మకం ప్రజలకు కలగడం లేదని ఎక్కువ మంది అభిప్రాయం. దసరా నుంచి పవన్ యాత్ర ప్రారంభిస్తున్నారు. ఎన్నికల వరకూ ఆయన జనంలోనే ఉంటారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే రాజకీయంగానూ ఆయన సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
2024 ఎన్నికలు జనసేనకు అత్యంత కీలకం – అంతా పవన్ చేతుల్లోనే !
పవన్ కల్యాణ్ సొంత రాజకీయ పార్టీ ద్వారా ఇప్పటికే రెండు ఎన్నికలను ఎదుర్కొన్నారు. ఓ ఎన్నికలో అసలు పోటీ చేయలేదు. మరో ఎన్నికల్లో పోటీ చేసి ఘోరపరాజయం పాలయ్యారు. స్వయంగా తాను రెండు నియోజకవర్గాల్లో ఓడిపోవడం… ఆయనను బాధించి ఉంటుంది. చట్టసభల్లోకి కూడా అడుగుపెట్టలేకపోవడం ఆయన వైఫల్యం. పవన్ కల్యాణ్ ఓటు బ్యాంక్ గణనీయంగాఉంది. కానీ అదంతా ఒక్క చోట లేదు. మెజార్టీల మీద నడిచే రాజకీయంలో ఓట్లను సమీకరించుకోవాలంటే వ్యూహాత్మకంగా ముందుకెళ్లాల్సి ఉంటుంది.
పవన్ కల్యాణ్ రాజకీయంగా విశాలమైన దృక్పథంతో ఆలోచించాల్సి ఉంది. ఉన్న బలాన్నే పక్కాగా వాడుకునే ప్రయత్నం చేయాలి. మన వల్ల ఇతరులు లాభపడుతున్నారా అనేదాని కన్నా మనం ఎంత లాభపడుతున్నామన్నది చూసుకోవాలి. ఎందుకంటే.. వచ్చే ఎన్నికల్లో గెలుపోటములు కాదు.. గెలుపే రావాలి. ఉనికిని బలంగా చాటాలి. లేకపోత పవన్ కల్యాణ్.. తాను ఇబ్బంది పడటమే కాదు.. తనను నమ్ముకున్న ఓ వర్గాన్ని కూడా ఇబ్బంది పెట్టిన వారవుతారు.
పవన్ కల్యాణ్ ఓటమితో ప్రారంభించి సినిమా రంగంలో అత్యున్నతంగా ఎదిగారు. రాజకీయాల్లోనూ ఆయన ఓటమితో ప్రారంభించారని అనుకోవచ్చు. పవన్ కృషి, పట్టుదల.. రాజకీయాలపై ఆయనకు ఉన్నఆసక్తి.. సామాజిక బాధ్యత వంటివిచూస్తే.. ఆయన ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. కానీ ఆయన గుర్తించాల్సింది.. రాజకీయాలంటే సినిమా రంగం కాదు. పూర్తి స్థాయిలో ప్రత్యేకం. సినీ రంగంలో సక్సెస్ ఫార్ములా రాజకీయాల్లో వర్కవుట్ కాదు. రాజకీయాల్లో కావాల్సింది ఆలోచన.. ఆవేశం కాదు. ఆ ఆలోచనే విజయాన్ని అందిస్తుంది. పవన్ విశాలంగా ఆలోచిస్తారని.. విజయం సాధిస్తారని ఆశిద్దాం..!
హ్యాపీ బర్త్ డే పవన్ కల్యాణ్ !