వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఇటీవల బీజేపీ అగ్రనాయకులని కలవడం, ఆ తర్వాత జగన్ రఘు రామ కృష్ణం రాజు కు క్లాస్ తీసుకుని విజయ సాయి రెడ్డి మిథున్ రెడ్డి లకు తెలియకుండా బిజెపి అగ్ర నాయకత్వాన్ని ఏ ఒక్క వై ఎస్ ఆర్ సి పి ఎంపీ కూడా కలవ కూడదు అని హెచ్చరించినట్లు గా వార్తలు రావడం తెలిసిందే. ఈ వార్తల పై ఈ రోజు ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు వైఎస్సార్సీపీ ఎంపీ రఘు రామ కృష్ణంరాజు. దాంతో పాటే ఇటీవల పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పర్యటన జరిపి, ఆ పర్యటన లో బిజెపి పెద్దలతో కొన్ని కీలక మంతనాలు జరిపాడని వార్తలు వచ్చాయి. అయితే సోషల్ మీడియాలో పవన్‌కళ్యాణ్ ఢిల్లీలో రఘు రామ కృష్ణంరాజు ఇంట్లో దిగాడని, బిజెపి పవన్ కళ్యాణ్ ల మధ్య మంతనాల లో రఘు రామ కృష్ణం రాజు కూడా ఒక పాత్ర పోషించాడని కొన్ని వార్తలు వచ్చాయి. దీని మీద కూడా రఘు రామ కృష్ణంరాజు స్పందించాడు. వివరాల్లోకి వెళితే..
విజయసాయిరెడ్డికి తెలియకుండా బిజెపి నేతలను కలవకూడదనే జగన్ సూచన నాకు అర్థం కాలేదు: రఘురామకృష్ణంరాజు
ఆ మధ్య రాజ్య సభ ఎంపీ సుజనా చౌదరి కొంత మంది వైఎస్ఆర్ సీపీ ఎంపీ లు బీజేపీ తో టచ్‌లో ఉన్నారని వ్యాఖ్యలు చేసి కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే సుజనా చౌదరి పేర్కొన్న ఆ ఎంపీల లో రఘురామ కృష్ణంరాజు మొదటి వరుస లో ఉన్నాడు అని విశ్లేషకులు భావించారు. రఘు రామ కృష్ణంరాజు బిజెపి అగ్ర నాయకత్వాన్ని వ్యక్తిగతంగా కలవడం దానికి కారణం. అయితే ఆ తర్వాత రఘు రామ కృష్ణం రాజు సుజనా చౌదరి వ్యాఖ్యల ను ఖండించినప్పటికీ, ఆయన బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నాడు అన్న రూమర్లకు తెర పడలేదు. అయితే ఈ రూమర్లకు బలం ఇచ్చేలా ఈరోజు వ్యాఖ్యలు చేశాడు రఘు రామ కృష్ణం రాజు. విజయ సాయి రెడ్డి, మిథున్ రెడ్డి లకు తెలియకుండా వైఎస్ఆర్ సీపీ ఎంపీలు ఎవరూ బిజెపి అగ్ర నాయకత్వాన్ని కలవకూడదు అని జగన్ చేసిన సూచన తనకు అర్థం కాలేదు అంటూ వ్యాఖ్యలు చేసి మరొకసారి సంచలనం సృష్టించాడు రఘు రామ కృష్ణంరాజు. అయితే గతంలో బిజెపి లో పనిచేసి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ లోనూ, ప్రస్తుతం వైఎస్సార్సీపీ లో ఉన్నటువంటి రఘు రామ కృష్ణంరాజు తనకు అన్ని పార్టీల నేతల తో తనకు వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయని, ఆ పరిచయం మేరకు ఆయా పార్టీల నాయకులను కలిస్తే తప్పేంటి అని వాదిస్తున్నారు.
ఢిల్లీ లో పవన్ కళ్యాణ్ తన ఇంట్లో దిగాడనే వ్యాఖ్యలపై రఘు రామ కృష్ణంరాజు స్పందన:
సోషల్ మీడియాలో ఆ మధ్య వైరల్ గా మారిన ఈ రూమర్ల పై స్పందించాడు రఘురామకృష్ణంరాజు. అసలు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వచ్చిన సంగతి తనకు తెలియదని, పవన్ కళ్యాణ్ బిజెపి నేతలతో చర్చలు జరిపిన సంగతి కూడా తనకు తెలియదని రఘు రామ కృష్ణం రాజు వ్యాఖ్యానించాడు. అయితే 2019 ఎన్నికల ముందు నాగబాబు మీద, జనసేన పార్టీ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన రఘు రామ కృష్ణంరాజు ఇప్పుడు కాస్త గొంతు సవరించుకున్నట్లు గా కనిపిస్తోంది. తాను పవన్ కళ్యాణ్ మీద ఎప్పుడూ నెగటివ్ వ్యాఖ్యలు చేయలేదని, ఎన్నికల ప్రచారం సందర్భంగా కేవలం నాగబాబు మీద మాత్రం కొన్ని వ్యాఖ్యలు చేసిన మాట మాత్రమే వాస్తవమేనని, ఇంకా మెగాస్టార్ చిరంజీవి అంటే తనకు ఎంతో అభిమానమని, వాళ్ల అబ్బాయి రామ్ చరణ్ అంటే ఇంకా ఇష్టం అని, ఇలా మెగా ఫ్యామిలీ మీద చాలా సాఫ్ట్ కార్నర్ ప్రదర్శించాడు. ఎన్నికల ముందు జనసేన మీద ఒక రేంజ్ లో విరుచుకుపడ్డ రఘు రామ కృష్ణంరాజు ఇప్పుడు ఈ విధంగా స్పందించడం వల్ల, ఢిల్లీలో పవన్ కళ్యాణ్ తన ఇంట్లో దిగాడు అన్న రూమర్లను ఖండిస్తున్నప్పటికీ ప్రజల లో పూర్తిగా నమ్మకం కలగడం లేదు.
మొత్తానికి, రఘు రామ కృష్ణంరాజు వైఖరీ చర్చనీయాంశంగా మారింది. వివరణ ఇవ్వడానికి తాను చేస్తున్న వ్యాఖ్యలు మరింత గందరగోళానికి చర్చకు దారితీస్తున్నాయి. తెరవెనుక ఏం జరుగుతుంది అనేది తెలియడానికి ఇంకొంత కాలం పట్టవచ్చేమో!