జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో మరో పన్నెండు ఎకరాలు కొనుగోలు చేశారు. ఇల్లు ప్లస్ క్యాంపు ఆఫీస్ కోసం గతంలో దాదాపుగా రెండు ఎకరాలు కొనుగోలు చేశారు. అయితే మరింత విశాలంగా ఇల్లు, క్యాంపు ఆఫీస్ ఉండాలన్న ఉద్దేశంతో మరో పన్నెండు ఎకరాలు ఆ చుట్టుపక్కలే కొనుగోలు చేశారు. మొత్తంగా దాదాపుగా పధ్నాలుగు ఎకరాల్లో పవన్ కల్యాణ్ క్యాంపు ఆఫీసు, ఇల్లు ఉండనుంది.
రిజిస్ట్రేషన్ ను జనసేన పార్టీ నేత తోట సుధీర్ పూర్తి చేశారు. పవన్ ఇప్పటికే అక్కడ ఓ రైతు ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఆ ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలని అనుకుంటున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ప్రత్యేకమైన వసతులు ఉండాలని కోరుకుంటున్నారు. అందులో భారీ స్థాయిలో ఇల్లు, క్యాంప్ ఆఫీసును సిద్దం చేసుకుంటున్నారు.
పవన్‌కు వ్యవసాయం అంటే మక్కువ. తన ఇల్లు, క్యాంపు ఆఫీస్ ఉన్న చోట్లను వ్యవసాయ క్షేత్రంగా మార్చుకునే అవకాశాలు ఉన్నాయి. చుట్టూ పచ్చదనం మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటే రాజకీయంగా వచ్చే టెన్షన్ల నుంచి రిలీఫ్ వస్తుందని అందుకే పవన్ ఇలా ఇల్లు నిర్మించుకుంటున్నారని అంటున్నారు. మొత్తంగా పవన్ కల్యాణ్ పిఠాపురం వాసిగా పూర్తి స్థాయిలో మారిపోతున్నారు.