జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోరాటయాత్ర… తొలి విడత ముగిసింది. తన సెక్యూరిటీ సిబ్బందిలో అత్యధికులు ముస్లిములే అయినందున.. వారందరూ పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో.. తన పోరాటయాత్రకు తాత్కాలిక విరామం ఇస్తున్నట్లు జనసేన అధినేత ప్రకటించారు. రంజాన్ పండుగ తర్వాత మళ్లీ యథావిధిగా విశాఖ జిల్లా నుంచి… పోరాటయాత్ర ప్రారభమవుతుంది. రంజాన్ పండుగ తర్వాత రోజు నుంచా లేక… ఆ తర్వార మరో రోజు నుంచా ఆన్నదానిపై క్లారిటీ లేదు. కానీ ఇప్పటికై… రంజాన్ పండుగ వరకు.. పోరాటయాత్రకు.. సెక్యూరిటీకి రంజాన్ సెలవులు ఇవ్వాల్సిన కారణంగా విరామం ఇచ్చేశారు.
గత నెల ఇరవయ్యే తేదీ ఇచ్చాపురంలో ప్రారంభమైన జనసేన అధినేత పోరాటయాత్ర.. ఓ దశ..దిశా లేకుండా సాగిపోయింది. ఏ రోజు ఏ నియోజకవర్గంలో కవాతు చేయాలో.. అంతకు ముందు రోజు సాయంత్రం వరకూ నిర్ణయం తీసుకోకుండా.. గాలి ఎటు వస్తే..అటు సాగింది యాత్ర. ఇందులో నికరంగా.. వరుసగా నాలుగు రోజుల పాటు యాత్ర సాగింది మొదట నాలుగు రోజుల మాత్రమే. ఆ తర్వాత ఒకరి రెండు రోజులకే.. మూడు,నాలుగు రోజుల విరామాలు తీసుకోవడం ప్రారంభించారు. మొత్తం ఇరవై ఒక్క రోజుల పోరాటయాత్రలో పవన్ కల్యాణ్ పోరాటం చేసింది.. పది రోజులు మాత్రమే.. అంటే రోజు మార్చి రోజు మాత్రమే పార్టీ కవాతు చేశారు.
వాస్తవానికి నలభై ఐదు రోజుల పాటు.. నియోజకవర్గానికి రెండు రోజుల చొప్పున… పర్యటిస్తానని పవన్ మొదటి రోజు ఘనంగా ప్రకటించారు. కానీ తీరా చూస్తే.. ఒక్క రోజే.. మూడు నియోజకవర్గాలను చట్టిపారేశారు. ఆ తర్వాత మూడు రోజుల పాటు రెస్ట్ తీసుకున్నారు. మధ్యలో ఓ సారి సెక్యూరిటీకి గాయాలయ్యాని చెప్పి రెండు రోజులు రిసార్ట్‌కు పరిమితమయ్యారు. ఆ తర్వాత జ్వరం అని చెప్పి అరకులో నాలుగు రోజుల పాటు రెస్ట్ తీసుకున్నారు. ఈ మధ్యలో ప్రణాళిక లేక బొబ్బిలి రెండు రోజులు ఖాళీగా ఉండిపోయారు. అసలు యాత్ర కన్నా.. డుమ్మాలే ఎక్కువ.
తన పోరాటయాత్రలో కనీసం తన సిద్ధాంతాలపైనా పవన్ కల్యాణ్ చెప్పారా అంటే అందీ లేదు.. ఎంత సేపు ప్రభుత్వ అవినీతి అంటూ.. ఆవేశంతో అరవడమే తప్ప.. తాను వస్తే ఏం చేస్తానో.. ఒక్క ముక్క కూడా చెప్పలేదు. తన పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టలేదు. పైగా.. తన ప్రసంగంలో ఎన్నో అమాయకమైన విమర్శలు చేసి.. నెటిజన్లకు హాట్ ఫేవరేట్‌గా మారారు. బొబ్బిలికి వెళ్లి.. అశోక్ గజపతిరాజుకు చాలెంజ్ చేయడం దగ్గర్నుంచి… ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థను ఓ వ్యక్తిగా పేర్కొనడం వరకు పవన్ .. అవగాహనపై ఫ్యాన్స్‌లోనే అనుమానాలు కలిగేలా ప్రకటనలు చేశారు.
తొలి విడత పోరాటయాత్రలో పవన్ కల్యాణ్ ..జెండా, ఎజెండా కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమే. వైసీపీ అధినేత జగన్‌ను కానీ… ప్రత్యేకహోదా ఇవ్వాల్సిన నరేంద్రమోదీని కానీ ఒక్క మాట అనలేదు. ఎవరో టార్గెట్ ఇచ్చినట్లుగా.. మరెవరో చెప్పిన టాస్క్ పూర్తి చేయాలన్నట్లుగా .. ఒక్క చంద్రబాబును మాత్రమే ఎందుకు పవన్ కల్యాణ్ టార్గెట్ చేసుకున్నారో ఎవరికీ అర్థం కాలేదు. మొత్తానికి తొలి విడత పోరాటయాత్రలో.. పోరాటం తప్ప… మిగిలిన అంశాలే హైలెట్ అయ్యాయి. సెకండాఫ్.. రంజాన్ తర్వాత..!
–సుభాష్