‘టీఆర్పీలు తెచ్చే కార్యక్రమాల కోసం చచ్చిపోతారు కదూ?? వాటన్నిటికీ మించిన కార్యక్రమాన్ని మీకు చూపిస్తా’ అని శుక్రవారం ఉదయం ట్విట్టర్లో స్టేట్మెంట్ ఇచ్చిన పవన్ కల్యాణ్… చెప్పినట్టుగా హాట్ హాట్ ట్వీట్లతో ఆయన షోను రక్తి కట్టిస్తున్నారు. ఈరోజు ఉదయం ట్విట్టర్లో పవన్ మరోసారి రెచ్చిపోయారు. ప్రేక్షకుల్లో ఉత్కంఠ కలిగించేలా, అభిమానుల్లో ఉత్సాహం వచ్చేలా వరుస ట్వీట్లు చేశారు. ఆయన ట్వీట్లు, అందుకు విశ్లేషణలు…
పవన్ ట్వీట్:
నిజమైన ‘అజ్ఞాతవాసి’ ఎవరో మీకు తెలుసా?
విశ్లేషణ:
టీవీ9, రామ్ గోపాల్ వర్మ, నారా లోకేష్, లోకేష్ స్నేహితుడు రాజేష్ కిలారిలతో పాటు ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలపై నిన్న పవన్ ఆరోపణలు చేశారు. వీరి వెనుక మరో వ్యక్తి ఉన్నారని అర్థం వచ్చేలా ఈ ట్వీట్ చేశారు. పవన్ టార్గెట్ ఎవరో?
పవన్ ట్వీట్:
నాకు ఇష్టమైన స్లోగన్ ‘ఫ్యాక్షనిస్టుల ఆస్తలును జాతీయం చెయ్యాలి’.
అసలు ఈ స్లోగన్ వెనకాల కథకి, ఈ స్లోగన్ కి సంబంధం ఏంటి?
విశ్లేషణ:
టీవీ9 ఛానల్లో బ్రేక్ తర్వాత, బ్రేక్ ముందు ఈ స్లోగన్ వస్తుంది. అంటే… ఇన్‌డైరెక్టుగా టీవీ9 మీద గురిపెట్టిన ట్వీట్ ఇది. టీవీ9 అధిపతి శ్రీనిరాజుపై, ఆయన ఆస్తులపై ఏదో సమాచారం సేకరించి ఈ ట్వీట్లు చేశారట.
పవన్ ట్వీట్:
ఒక రాష్ట్ర కాబినెట్ ర్యాంక్ మంత్రి స్వయానా ఈ ‘అజ్ఞాతవాసి’ని ‘వాడో blackmailer’ అని… స్వయానా ముఖ్యమంత్రి గారు అన్నారని అని… ‘ఒకరి’తో అన్నారు.
ఆ మంత్రి ఎవరు? ఆ ముఖ్యమంత్రి ఎవరు? ‘ఒకరు’ ఎవరు? తెలుసుకోవాలనివుందా!!!
విశ్లేషణ:
ఇందులో కొంత గందరగోళం వుంది. ప్రేక్షకులకు అర్థం కావడానికి కొంచెం టైమ్ పడుతుంది. అంతకు ముందు ట్వీట్లో పవన్ ఒకరిని అజ్ఞాతవాసిగా పేర్కొన్నారు. అతణ్ణి ముఖ్యమంత్రి ‘బ్లాక్ మెయిలర్’గా సంభోదించారని ఒకరితో రాష్ట్ర కాబినెట్ మంత్రి చెప్పారని పవన్ ఉద్దేశం.
పవన్ ఈ విధంగా ఆరోపణలు చేయడం కొత్త కాదు. కానీ, ఆరోపణలకు ఆధారాలు చూపకుండా కొన్ని రోజుల తర్వాత ఎవరో నా దగ్గర అంటే నేను అన్నానని కంక్లూజన్ ఇస్తారు. ఈసారి మాత్రం సీరియస్‌గా ఆధారాలు చూపించి చర్చకు తెర తీసేట్టు వున్నారు. ఎందుకంటే…
“స్టే ట్యూన్డ్! లైవ్ ఫ్రమ్ హైదరాబాద్. ‘నిజాలు నిగ్గు తేలుద్దాం’ ప్రోగ్రాం నుంచి మీ పవన్ కల్యాణ్”
“స్టే ట్యూన్డ్ టు ‘బట్టలు విప్పుకుందాం’ ప్రోగ్రాం. పవన్ కల్యాణ్ విత్ కెమరామెన్ ట్విట్టర్” అంటున్నారు.
మొత్తానికి ఈ రోజు పవన్ ఏం చేస్తారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ రోజు ఎవర్ని టార్గెట్ చేశారో మరి!
చివరగా ఓ మాట: పవన్‌కంటూ ఒక స్థాయి, హోదా వున్నాయి. అటువంటి వ్యక్తి ‘బట్టలు విప్పుకుందాం’ వంటి మాటలు ఉపయోగించడం ఆయన హుందాతనానికి తగదు. అలాగే, ట్వీట్లలో అక్షర దోషాలు ఏంటో? ఆవేశం వస్తే పవన్‌ని ఎవరూ ఆపలేరని అంటుంటారు. అదే ఆవేశంలో టైప్ చేసినట్టున్నారు.