జనసేన అధినేత పవన్ కల్యాణ్… బస్సుయాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ బస్సుయాత్ర ఉద్దేశం, రూట్ మ్యాప్ లాంటి విషయాలను ఆయన ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. బహుశా కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెల్లడయిన.. రెండు, మూడు గంటల్లో పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ ఉంటుందని… జనసేనవర్గాలు మీడియాకు చెబుతున్నాయి. తిరుపతిలోని జాపాలి ఆంజనేయస్వామిని దర్శించుకుని ఆయన తన రాజకీయ కార్యాచరణను ప్రకటించబోతున్నారంటున్నారు.
మామూలుగా అయితే పవన్ కల్యాణ్ ఏదో.. ఉద్దేశంతో ప్రజల్లోకి వస్తున్నారు అనగానే… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదట ఉలిక్కి పడుతుంది. సమస్యల్ని పక్కదోవ పట్టించి.. ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడానికే పవన్ కల్యాణ్ రోడ్డు మీదకు వస్తున్నారని విమర్శలు ప్రారంభిస్తుంది. నిన్నామొన్నటి దాకా పవన్ కల్యాణ్‌పై వైసీపీ స్టాండ్ ఇదే. చివరికి జగన్మోహన్ రెడ్డి కూడా.. పవన్ సినిమాకు ఇంటర్వెల్ ఎక్కువని ఎకసెక్కాలాడారు. చంద్రబాబుకు అవసరమైనప్పుడే రోడ్డు మీదకు వస్తున్నారని మండిపడ్డారు కూడా. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పవన్ బస్సుయాత్రను.. వైసీపీ నిండు మనసుతో ఆహ్వానించింది.
పవన్ కల్యాణ్ బస్సుయాత్రపై … వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి… సానుకూలంగా మాట్లాడి కలకలం రేపారు. పవన్ బస్సు యాత్ర ఎజెండా ఏమిటో చెప్పక ముందే.. ప్రజాసమస్యల పరిష్కారానికే పవన్ యాత్ర చేయబోతున్నారని…దానిని తమ పార్టీ ఆహ్వానిస్తోందని ప్రకటించేశారు. ప్రజాసమస్యలపై ఎవరు పోరాడినా అహ్వానిస్తామన్నారు.
గతంలోనూ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ పోరాడారు. అప్పుడు ప్రభుత్వం కూడా పవన్ కల్యాణ్ లేవనెత్తిన అంశాలకు ప్రాధాన్యం ఇచ్చింది. పరిష్కారాలు చూపింది. కానీ అప్పుడు వైసీపీకి మాత్రం… చంద్రబాబుతో కుమ్మక్కవడంలా కనిపించింది. ఇప్పుడు పవన్ చేపట్టబోయే బస్సు యాత్రం .. నిఖార్సుగా సమస్యలపై చేస్తున్న పోరాటంలా కనిపిస్తోంది. ఏపీ రాజకీయ పరిస్థితుల్లో వచ్చిన స్పష్టమైన మార్పు.. ఇదేనేమో..? భవిష్యత్ సమీకరణాలకూ సూచికేమో..?