ఒక్క సీటు కూడా వైసీపీకు వెళ్లకుండా ఓడగొట్టాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. టీడీపీతో జనసేన పొత్తు కనీసం ఓ దశాబ్దం కాలం పాటు ఉండాలన్నారు. దశాబ్ద కాలంపాటు పొత్తు ఉంటేనే రాష్ట్ర విభజన నష్టాన్ని, వైసీపీ పాలన విధ్వంసం నుంచి ఏపీని కాపాడుకోగలమన్నారు. తన భవిష్యత్తు కోసం నేనేం చేయడం లేదని.. ఏపీ భవిష్యత్తు కోసమే తాను కృషి చేస్తున్నానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తాను ఒక్కసారి మాటిస్తే వెనక్కి వెళ్లను, మీకు అండగా ఉంటాను అని హామీ ఇచ్చారు జనసేనాని. విశాఖకు చెందిన మైనారిటీ నాయకుడు సాధిక్, దర్శికి చెందిన గరికపాటి వెంకట్ జనసేనలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పవన్ కల్యాణ్.
ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ”మీ రాక జనసేనకు చాలా బలం. మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నా. గత తొమ్మిదేళ్లుగా జనసేన అనేక ఒడిదొడుకులు ఎదుర్కొని ఇక్కడికి వచ్చింది. వైసీపీ లాంటి గూండా నాయకులను ఎదుర్కోగలుగుతున్నాం. యువత నాకు అండగా నిలిచింది. మనందరం కలిసి పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.
వైసీపీ పాలనలో రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారింది. దిక్కు లేకుండా పోయింది. మైనారిటీ అనే పదంతో దూరంగా వెల్ళిపోవడం బాధేస్తుంది. మీరంతా మెయిన్ స్ట్రీమ్ లో ఉండాలని పిలుపునిచ్చారు. నాకు మతాలపైన చాలా గౌరవం ఉంది. నన్ను ప్రేమించే మైనారిటీలు.. నేను బీజేపీతో ఉన్నానని అందుకే దూరంగా ఉన్నామని అంటుంటారు. కానీ మీకు ఏమైనా నష్టం జరిగితే నేను ఎల్లప్పుడూ అండగా ఉంటా. నేను మతవివక్ష చూపించను. అన్ని మతాల వారు మీ వద్దకు రావాలి. కులం, మతం దాటి వచ్చాను. మానవత్వాన్ని నమ్ముతాను. వైజాగ్ ముస్లింల సమస్యలు, ఇబ్బందులు నాకు తెలుసు. నేను మీకు అండగా ఉంటాను. ఒక్కసారి జనసేనను నమ్మండి. ముస్లింలను మైనారిటీ ఓటు బ్యాంకుగా చూడనని హామీ ఇచ్చారు.
ఓ వైపు వైసీపీలో గందరగోళం ఏర్పడితే.. టీడీపీ, జనసేనలోకి పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయి. దాదాపుగాప్రతీ వారం కీలక నేతల్ని చేర్చుకునేందుకు సమావేశాలను పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్నారు.