ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయిది. ఇది స్థానిక సమరం.. రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులమని చెప్పుకుంటున్న అగ్ర పార్టీల నేతలెవరూ.. ప్రచారానికి వెళ్లడం లేదు. అధికార పార్టీలో మంత్రుల స్థాయిలో… ప్రతిపక్ష పార్టీలో జిల్లా స్థాయి నేతలు వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నారు. పెద్ద నేతలు ప్రచారానికి కూడా వెళ్లే అవకాశం లేదు. అయితే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం ప్రచారానికి వెళ్తారని బీజేపీ -జనసేన వర్గాలు ప్రచారం ప్రారంభించాయి. రెండు పార్టీలు పొత్తులు పెట్టుకుంటున్నందున.. జనసేన తరపున పవన్ కల్యాణ్.. బీజేపీ తరపున ఓ జాతీయ స్థాయి నేత ప్రచారం చేయాలని… నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. బీజేపీ తరపున ఏ జాతీయ స్థాయి నేత వచ్చినా… వారి వచ్చే వచ్చే ఉపయోగం.. ఉండదు. ఓట్లు కూడా రావు. కానీ పవన్ కల్యాణ్ ప్రచారం వేరు.
ఇతర పార్టీల అగ్రనేతలెవరూ.. రాజకీయ ప్రచారానికి దిగని సమయంలో.. ఆయన ప్రచారానికి వెళ్తే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు. గ్రామ స్థాయిలో… జనసేన – బీజేపీలకు ఉన్న పట్టు చాలా తక్కువ . క్యాడర్ కూడా లేదు. స్థానిక ఎన్నికల్లో కూడా ఓట్లు వేయించుకునే యంత్రాంగమే కీలకం. అలాంటి యంత్రాంగం లేకుండా.. గొప్ప ఫలితాలు ఆశించడం అత్యాశే. గొప్ప ఫలితాలు రావని తెలిసినప్పుడు… ప్రచార రంగంలోకి దిగడం కూడా.. ఉన్న పేరును చెడగొట్టుకోవడమే అవుతుంది. ప్రచారానికి రావాలని బీజేపీ ఒత్తిడి చేసే అవకాశం ఉంది. బీజేపీ లక్ష్యం వేరు. కానీ.. పవన్ కల్యాణ్ ఇమేజ్ ను మరింత డ్యామేజ్ చేసే పరిస్థితులు.. ప్రచారానికి వెళ్తే వస్తాయి. ఇప్పటికే పవన్ కల్యాణ్ రెండు చోట్ల పరాజయం పాలయ్యారని.. ఆయనపై ప్రజలకు నమ్మకం లేదని.. అధికార పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది.
ఇలాంటి సమయంలో..స్థానిక సంస్థల ప్రచారానికి వెళ్లి మెరుగైన ఫలితాలు సాధించకపోతే.. పవన్ ను మోరల్‌గా మరింత కుంగదీసే ప్రయత్నాలు అధికార పార్టీ నేతలు చేస్తారు. ఈ విషయాలన్నీ జనసేన నేతలకు తెలుసు. సాధారణంగా అయితే.. పవన్ కల్యాణ్.. ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉండదు.. కానీ.. ఇప్పుడు బీజేపీతో పొత్తు ఉన్నందున పొత్తు ధర్మం ప్రకారం.. ఆ పార్టీ ఒత్తిడి తెస్తే.. ప్రచారంలోకి పాల్గొనకతప్పుదు. అందుకే.. జనసేన వర్గాలు టెన్షన్ పడుతున్నాయి.