అమరావతి రైతుల కోసం కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. అమరావతి రాజధానిపై చిత్తశుద్ధి ఉంటే పదవులు వదిలేసి ప్రత్యక్ష పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. రాజధాని వికేంద్రీకరణ పేరిట పాలకులే మూడు ప్రాంతాల మధ్య చిచ్చు రేపుతున్నారని .. టీడీపీ లక్ష కోట్ల రాజధాని అన్నప్పుడూ.. వైసీపీ మూడు రాజధానులు అన్నప్పుడూ జనసేన ప్రమేయం లేదని పవన్ స్పష్టం చేశారు. ప్రజలు, రైతులు ప్రశ్నించాల్సింది టీడీపీ, వైసీపీనేనన్నారు.
అమరావతి రైతులు అన్యాయం కాకుండా.. వారి తరపున న్యాయపోరాటం చేయాలని జనసేన పార్టీ నిర్ణయించింది. మూడు రాజధానుల బిల్లులపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సంతకం చేయడంతో.. ఏపీలో అమరావతి పరిస్థితి అటూ ఇటూ కాకుండా పోయింది. మొదటి నుంచి అమరావతికి మద్దతిస్తామని.. అమరావతి కోసమే… బీజేపీతో పొత్తు పెట్టుకున్నానని చెుబతూ వచ్చిన పవన్ కల్యాణ్… ఇప్పుడు.. ఏం చెబుతారన్నదానిపై ప్రజల్లో ఆసక్తి ఏర్పడింది. పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశాన్ని ఆన్ లైన్ ద్వారా ఏర్పాటు చేసిన పవన్… కీలక వ్యాఖ్యలుచేశారు. జగన్‌రెడ్డి వ్యక్తిగత ప్రయోజనాల కోసమే మూడు రాజధానులని టీడీపీ, వైసీపీ రాజకీయాలకు రైతులను బలిచేయొద్దని తీర్మానించారు. రైతులకు న్యాయం జరిగే వరకు జనసేన అండగా ఉంటుందని భరోసాగా ఇచ్చారు.
టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పులను.. వైసీపీ ప్రభుత్వం తన స్వార్థానికి ఉపయోగించుకుంటోందని పవన్‌కళ్యాణ్ చెప్పుకొచ్చారు. మరో ప్రభుత్వం వచ్చినా.. రైతులకు అన్యాయం జరగకుండా చట్టం ఉండాలని గతంలోనే సూచించామని పవన్ వ్యాఖ్యానించారు. అప్పుడు తమ డిమాండ్‌ను ఎవరూ పట్టించుకోలేదని .. ప్రస్తుత పరిణామాలకు టీడీపీ బాధ్యత వహించాలని పవన్‌కళ్యాణ్ తేల్చేశారు. చట్టాలను.. రాజ్యాంగాన్ని పట్టించుకోకుండా… జగన్. .రాజధానిని తరలిస్తున్నారని నిపుణులు చెబుతున్న మాటలను మాత్రం.. జనసేన పెద్దగా పట్టించుకోలేదు. నిర్మాణాలను మధ్యలోనే ఆపివేయడం టీడీపీ చేసిన తప్పు అంటూ పవన్ తీర్మానించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకూ..నిర్మాణాలు జోరుగా సాగాయి. జగన్ వచ్చిన తర్వాతనే అన్నీ ఆపేశారు.
మొత్తానికి పవన్ కల్యాణ్.. రాజధాని కోసం రాజీనామాల డిమాండ్‌ను తెరపైకి తీసుకు వచ్చారు. టీడీపీ , వైసీపీలు ఎలా స్పందిస్తాయో ..వేచి చూడాల్సి ఉంది.