జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి సీఎం చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. బస్సుయాత్రలో భాగంగా ఆయన తగరపువలసలో జరిగిన సభలో ప్రసంగించారు. గత ఎన్నికల్లో ఆంధ్రా నుంచి కాంగ్రెస్ ను తరమికొట్టాలని పిలుపునిచ్చింది తానేనని గుర్తుచేశారు. సీఎం చంద్రబాబు నాయుడుగానీ, టీడీపీ నేతలుగానీ అంత ధైర్యం చెయ్యలేకపోయారనీ… కాంగ్రెస్ నేతల పంచలూడగొట్టండని చెప్పింది తాను మాత్రమేనని పవన్ అన్నారు. ప్రత్యేక హోదాపై పోరాటం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని పవన్ అన్నారు. విశాఖ రైల్వేజోన్ సాధించాలనుకుంటే టీడీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించాలనీ, ఆ తరువాత అందరం కలిసి రైల్ రోకో చేద్దామని పవన్ పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి కూడా రాజీనామా చేసి, ప్రతిపక్ష నేత జగన్ కూడా వస్తే, తాను కూడా కలుస్తా అన్నారు. సీఎం, జగన్, పవన్.. ముగ్గురం కలిసి రైల్వే లైను మీద కూర్చుందాం, మనపై కేసులు పెడితే అప్పుడు చూద్దాం అంటూ పవన్ ఆవేశంగా మాట్లాడారు. విశాఖ రైల్వే జోన్ మీద నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీలతో రాజీనామాలు చేయించాక, అందరం కలిసి ప్రత్యేక హోదా కోసం అప్పుడు పోరాటం చేద్దామన్నారు.
రాజీనామాలు చేసి వస్తే, పోరాటం ప్రారంభిద్దామని పవన్ అంటున్నారు! కానీ, జనసేన ప్రత్యేక హోదా పోరాటం ఇంకా మొదలుకాలేదేమోగానీ… టీడీపీ పోరాటం ఎప్పుడో మొదలైంది కదా. కేంద్ర ప్రభుత్వంలో భాగంగా ఉంటూ నాలుగేళ్లపాటు చేసిన ప్రయత్నం కూడా ఆ పోరాటంలో భాగమే కదా! అప్పటికీ కేంద్రం స్పందించకపోవడంతో.. పొత్తుని వదులుకోవడం, కేంద్రమంత్రి వర్గం నుంచి బయటకి రావడం కూడా పోరాటంలో భాగంగా పవన్ కనిపించడం లేదేమో..! ఇప్పుడు రాష్ట్రంలో ధర్మపోరాట దీక్షలు చేయడమూ పోరాటంలో భాగమే కదా.
ఇక, రాజీనామాలు చేసి పోరాటం చేద్దామని పవన్ చెప్పడమూ కాస్త విడ్డూరంగానే ఉంది! ఇదే ఆవేశంతో వైకాపా ఎంపీలు కూడా ప్రత్యేక హోదా సాధన కోసం రాజీనామాలు చేశారు. దాంతో ఒరిగిందేముంది..? ఆ తరువాత, వారు చేస్తున్న పోరాటం ఎక్కడుంది..? చట్టసభల ద్వారా హక్కుల్నీ, హామీల్నీ సాధించుకోవాలంటే… అక్కడ గళం వినిపించడానికి ప్రజా ప్రతినిధులు ఉండాలి. కేంద్రంపై ఒత్తిడి పెంచాలంటే చట్టసభల్లో మాట్లాడాలి. అంతేగానీ, బహిరంగ సభల్లో ఉద్వేగపూరిత ప్రసంగాలు ఎన్ని చేసినా ఏం ప్రయోజనం ఉంటుంది..? ఈ నెలలో జరగబోతున్న పార్లమెంటు సమావేశాల్లో మరోసారి ఏపీ ప్రయోజనాల అంశమై గళం వినిపించాలంటే.. రాష్ట్రం నుంచి ప్రజాప్రతినిధులు పార్లమెంటులో ఉండాలా వద్దా..? ప్రతీదానికీ రాజీనామాల కోసం డిమాండ్ చేయడమేనా..! అదే పరిష్కారం ఎలా అవుతుంది..? గత ఎన్నికల్లో పిలుపుతోనే ఏపీలో కాంగ్రెస్ పార్టీని పవన్ తరిమి కొట్టగలిగినప్పుడు… ఇప్పుడు కూడా ప్రత్యేక హోదా కోసం ఒక్కరే పోరాడితే ఎవరొద్దన్నారు..?