జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ని నాన్ బెయిలబుల్ వారెంట్ కింద అరెస్ట్ చేద్దామని ప్రయత్నించి తూ.గో జిల్లా పోలీసులు భంగపడ్డ విషయం తెలిసిందే. సాక్షాత్తు కోర్టు మొట్టికాయలు వేయడంతో పోలీసులు తమ ఓవరాక్షన్ కి బ్రేకులు వేయక తప్పలేదు. అయితే జగన్ ప్రభుత్వం చేసిన ఈ పని పై తీవ్రంగా స్పందించడమే కాకుండా వైకాపా ప్రభుత్వానికి సరైన సవాల్ విసిరారు పవన్ కళ్యాణ్.
చాలా చిన్నపాటి విషయాన్ని పోలీసులు అనవసరంగా పెద్దది చేశారని అభిప్రాయపడ్డ పవన్ కళ్యాణ్, అరెస్టయిన వారిలో ఒకతను డయాలసిస్ పేషెంట్ ఉన్నాడని, అతని కోసం తమ ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ కు వచ్చాడని, అయితే అతని పట్ల పోలీసులు సరిగా వ్యవహరించలేదని అన్నారు పవన్ కళ్యాణ్. తాను కూడా ఒక పోలీసు కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి గా తనకు పోలీసుల మీద ఉండే ఒత్తిడి తెలుసని, వారి పరిస్థితిని అర్థం చేసుకోగలనని, అయితే కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలిచిన జనసేన పార్టీ మీద ప్రభుత్వం ఎందుకింత కక్ష పూరితంగా వ్యవహరిస్తుందో చెప్పాలని పవన్ కళ్యాణ్ అన్నారు.
#WhoKilledBabai కేసును ప్రస్తావించిన పవన్ కళ్యాణ్:
అయితే తమ ఎమ్మెల్యే మీద ప్రతాపం చూపడం కాకుండా, ఇదే దూకుడు – కిరాతకంగా నరికి వేయబడి చనిపోయిన మీ సొంత బాబాయి వివేకానంద రెడ్డి హత్య కేసు మీద చూపాలని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు కొద్ది వారాల ముందు వైయస్ జగన్ బాబాయ్ వివేకానంద రెడ్డి హఠాత్తుగా చనిపోయిన విషయం తెలిసిందే. జగన్ సొంత ఛానల్ మరియు సొంత పత్రిక సాక్షి తో సహా, జగన్ కూడా వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించాడని ఆ రోజు ఉదయం ప్రకటించడం, తీరా పోలీసులు పోస్టుమార్టం చేయడానికి పట్టుబట్టడంతో అది సహజ మరణం కాదని, హత్య అని అర్థం కావడం, ఇంతలోనే వైఎస్ఆర్సీపీ నేతలు ప్లేటు ఫిరాయించి తెలుగుదేశం పార్టీ నేతలే గొడ్డలితో వివేకానందరెడ్డిని నరికి చంపారు అని సాయంత్రానికి మాట మార్చడం తెలిసిందే. ఈ కేసులో వివరాలు పోలీసులు బయటపెట్టకుండా, కోర్టుకు వెళ్లి మరి వైకాపా నేతలు ఉత్తర్వులు తెచ్చుకున్న సంగతి కూడా తెలిసిందే. అయితే జగన్ ముఖ్యమంత్రి కాగానే ఈ కేసులో పురోగతి ఉంటుందని భావించిన వివేకానందరెడ్డి అభిమానులకు ఈ కేసు పురోగమిస్తున్న తీరు తీవ్ర నిరాశ కలిగించింది. నిజంగా తెలుగుదేశం పార్టీ నేతలే గనక ఈ హత్య చేసి ఉంటే జగన్ సూచన మేరకు పోలీసులు కూడా ఈ కేసులో దూకుడుగా వ్యవహరించి ఉండేవారని, అలా జరగలేదంటే దానర్థం ఎన్నికల ముందు జగన్ చేసినవి ఫక్తు రాజకీయ ఆరోపణలు అని సామాన్య ప్రజానీకం భావించే పరిస్థితి కూడా ఏర్పడింది. సోషల్ మీడియాలో అయితే, #WhoKilledBabai ట్రెండింగ్ కూడా కావడం విశేషం. సరిగ్గా ఇదే ఈ విషయాన్ని అస్త్రంగా చేసుకొని పవన్ కళ్యాణ్ జగన్కు సవాల్ విసిరారు. మీ దూకుడు జనసేన ఎమ్మెల్యే విషయం లో కాదు కానీ మీ సొంత బాబాయి ని చంపిన కేసు మీద చూపండి అంటూ పవన్కళ్యాణ్ విసిరిన సవాల్ ఇప్పటికే సంచలనంగా మారింది.
నెల్లూరు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే మీద కేసులు పెట్టరా?
ఇదేవిధంగా ఇటీవల కాలంలో నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శల పాలైన సంగతి తెలిసిందే. ఆ సంఘటనను ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్, మీ పార్టీ ఎమ్మెల్యే ఒక పత్రికా సంపాదకుడి ఇంటికి వెళ్లి దాడి చేస్తే దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని జగన్ను ఉద్దేశించి అన్నారు.
ఇవియం సీఎం అన్న వ్యాఖ్యలు పరోక్షంగా ప్రస్తావించిన పవన్ కళ్యాణ్:
జగన్ 151 సీట్ల భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని స్థాపించిన నాటి నుండి ఒక వర్గం నెటిజన్లు, ఈవీఎం ల లో ట్యాంపరింగ్ జరిగిందని, అందువల్లే ఇంత భారీ మెజారిటీ జగన్ సాధించాడని అంటూ జగన్ ని ఈవీఎం సీఎం గా అభివర్ణిస్తూ వస్తున్నారు. మాయావతి, మమతా బెనర్జీ లాంటి కొందరు నేతలు కూడా ఈవీఎంల విషయంలో పలు అనుమానాలు లేవనెత్తు ఉన్నప్పటికీ ప్రస్తుతానికి అవన్నీ నిరాధార ఆరోపణలే. అయితే పవన్ కళ్యాణ్ పరోక్షంగా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, కొంతమంది మిమ్మల్ని ఈవీఎంల కారణంగా గెలిచాడని అంటున్నప్పటికీ, నేను అలాంటివి పట్టించుకోలేదని, భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మీపై నాకు గౌరవం ఉందని, ఆ గౌరవాన్ని మీరు నిలబెట్టుకోవాలని జగన్కు సూచించారు. తాను వంద రోజుల వరకు అధికార ప్రభుత్వానికి గడువు ఇద్దామని భావించినప్పటికీ, తాను ఆ నియమాన్ని బ్రేక్ చేసేలా మీరే చేశారని, మీ బెదిరింపులకు భయపడేది వ్యక్తిని నేను కాదని, ఇలాంటివి పునరావృతం అయితే రోడ్లమీదకు రావడానికి తాను సంకోచించనని, అలా వచ్చినప్పుడు పరిస్థితులు చేజారి పోతే దానికి మీరే బాధ్యులు అని పవన్ కళ్యాణ్ జగన్ ని హెచ్చరించారు.
ఏదిఏమైనా జనసేన ఎమ్మెల్యే విషయంలో ప్రభుత్వ సూచన మేరకు యంత్రాంగం చేసిన ఓవరాక్షన్ జనసేన పార్టీ అధినేతకు ఆగ్రహాన్ని తెప్పించిందని అర్థం అవుతోంది.