నాగబాబు మంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారన్నది ఓ సస్పెన్స్ గా మారింది. అయితే దీనిపై పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. నాగబాబు మార్చిలో ఎమ్మెల్సీ అవుతారని.. ఎమ్మెల్సీ అయిన తర్వాతనే మంత్రిగా ప్రమాణ స్వీకారం ఉంటుందని మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్ చాట్ లో పేర్కొన్నారు. మంత్రిగా నాగబాబుకు చాన్సివ్వడాన్ని పవన్ కల్యాణ్ గట్టిగా సమర్థించుకున్నారు. వారసత్వం, సామాజికవర్గం పేరుతో పార్టీ కోసం పని చేసిన వారిని పక్కన పెట్టలేనన స్పష్టం చేశారు.
నాగబాబుకు తన సోదరుడిగా కేబినెట్లో అవకాశం ఇవ్వలేదని స్పష్టం చేశారు. నాతో సమానంగా నాగబాబు పనిచేశారని మీడియా ప్రతినిధులకు పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. నాగబాబు తన సోదరుడు కాకపోయినా, కాపు సామాజికవర్గం కాకపోయినా ఆ స్థానంలో ఉన్న వాళ్లకు అవకాశం ఇచ్చేవాడిని స్పష్టం చేశారు. కందుల దుర్గేష్ది ఏ కులమో తనకు తెలియదన్నారు. ఆయన పని తీరును చూసే .. పార్టీ కోసం కష్టపడిన వైనం చూసే అవకాశం కల్పిచామన్నారు. నాదెండ్ల మనోహర్ స్థానంలో ఎవరైనా ఎస్సీ, బీసీ నేత నాతో కలిసి పనిచేసి ఉంటే వాళ్లకే అవకాశం ఇచ్చేవాడినన్నారు. కలిసి పార్టీ అభివృద్ధి కోసం పనిచేసేవాళ్లను వారసత్వంగా చూడలేమని పవన్ స్పష్టం చేశారు.
మీడీయా ప్రతినిధులతో పవన్ కల్యాణ్ చిట్ చాట్ లో అన్ని అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. నాగబాబుకు మంత్రి పదవిపై ఇప్పటి వరకూ మాట మాత్రంగా కూడా స్పందించలేదు. కానీ చిట్ చాట్ లో నాగబాబుకు మంత్రి పదవిపై వస్తున్న కామెంట్లు, ఇతర అంశాలన్నింటిపైనా క్లారిటీ ఇచ్చారు.