కమ్యూనిస్టు పార్టీలకు.. పవన్ కల్యాణ్ చాలా పెద్ద రిలీఫ్ ఇచ్చాడు. పవన్ కల్యాణ్ తమతో పొత్తులు పెట్టుకుంటారా లేదా.. అని కొద్ది రోజుల నుంచి వారు టెన్షన్ పడుతున్నారు. మొదట్లో జనసేనతో కలిసి పోరాటాలు చేసినా రాను.. రాను.. పవన్ కల్యాణ్ దూరమయ్యారు. ఇటీవలి కాలంలో కమ్యూనిస్టులను పవన్ కల్యాణ్ పట్టించుకున్న పాపాన పోలేరు. కమ్యూనిస్టులు మాత్రం.. ఏ కార్యక్రమం పెట్టినా.. జనసేన పేరును కూడా ఎటాచ్ చేస్తున్నారు కానీ.. ఆ పార్టీకి సంబంధించిన వారెవరూ రావడం లేదు. తెలంగాణలో… సీపీఎం పొత్తు కోసం ప్రయత్నించినా… పవన్ కల్యాణ్ స్పందించలేదు. దీంతో.. ఏపీలో ఏమంటారోనన్న టెన్షన్ కమ్యూనిస్టు అగ్రనేతల్లో ఉంది.
ఓ ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఏర్పాటు చేసి దానికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కల్యాణ్ ను కూడా గతంలో ఏకపక్షంగా ప్రకటించారు. దీనిపైనా.. జనసేన నుంచి స్పందన రాలేదు. అదే సమయంలో .. బీజేపీకి దగ్గరవుతున్నారని.. రామ్ మాధవ్ సలహాల ప్రకారం రాజకీయం చేస్తున్నట్లు ఫీలర్స్ రావడంతో వారికి మరింత టెన్షన్ ప్రారంభమయింది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో.. పవన్ కల్యాణ్ ను ఎలా సంప్రదించాలో తెలియక టెన్షన్ పడుతున్న సమయంలో.. అనుకోని వివాదం వారికి కలసి వచ్చింది. కలసి రావాలని చంద్రబాబు ఇచ్చిన పిలుపుతో.. రాజకీయ రచ్చ జరిగింది. దీనిపై.. పవన్ కల్యాణ్ స్పందించక తప్పలేదు. ఆ స్పందించడం .. కూడా కమ్యూనిస్టులతో మాత్రమే పొత్తు ఉంటుందని క్లియర్ గా చెప్పడంతో.. కమ్యూనిస్టులకు కొత్త ఊపిరి వచ్చినట్లయింది.
ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో… కమ్యూనిస్టులు… పవన్ కల్యాణ్ ఇచ్చిన ప్రకటనతో .. టెన్షన్ తగ్గించుకున్నారు. ఇక సీట్ల సర్దుబాటు కోసం.. వారు పవన్ కల్యాణ్ తో సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో కొత్తగా.. ఏదో ఆందోళన కార్యక్రమాలతో జనంలోకి వెళ్లే ప్రయత్నాలు కూడా చేయవచ్చు. అయితే.. కమ్యూనిస్టులను.. ఒకటే అనుమానం పట్టి పీడిస్తోంది. కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుంటానని పవన్ కల్యాణ్ చెప్పినా.. తర్వాత మళ్లీ 175 స్థానాల్లోనూ పోటీ చేస్తామని పవన్ చెప్పారు. అంటే.. సొంతంగానా.. పొత్తుతోనా..? అన్నదే వారి టెన్షన్. ఈ విషయంలో క్లారిటీ కోసం.. వాళ్లు మళ్లీ పవన్ కల్యాణ్ ఇంటి ముందు పడిగాపులు కాయాల్సి రావొచ్చు. అలాంటివి వాళ్లకు అనుభవమే కాబట్టి.. ఇబ్బంది రాకపోవచ్చనేది.. కమ్యూనిస్ట్ నేతల అభిప్రాయం.