జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ప్రత్యేకించి పదవులు, టికెట్ల విషయంలో పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ ముందు చూపుకు నిదర్శనం అని వారు విశ్లేషిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
వారాహి యాత్ర మొదలైన తర్వాత జనసేన గ్రాఫ్ బాగా పెరిగిందన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. అయితే జనసేన గ్రాఫ్ పెరుగుతూ ఉండడంతో, పవన్ కళ్యాణ్ కి అడ్డు కట్ట వేయడానికి ప్రత్యర్థి పార్టీలు కూడా వ్యూహాల కి పదును పెడుతున్నాయి. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల ప్రస్తావన తోనే పవన్ విమర్శలకు చెక్ పెట్టడానికి ప్రయత్నించిన పార్టీలు, కీలకమైన ఎన్నికల ఏడాదిలో అవి సరిపోవు అని అర్థం చేసుకుని, కొత్త తరహా విమర్శలు చేయడానికి సన్నాహాలు కూడా చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ విషయంలో మరొకసారి ప్రజారాజ్యం తరహా లో టికెట్లు అమ్ముకున్నాడు అన్న ప్రచారం చేయడానికి ప్రత్యర్థి పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి అన్న ఉప్పందడంతో పవన్ కళ్యాణ్ ఆ పుకార్లు పుట్టకముందే వాటిని తుంచేశాడు అన్న విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో కొత్త యువకులకు టికెట్లు ఇచ్చి ప్రయోగం చేసిన పవన్ కళ్యాణ్, ఈసారి అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులకు, నియోజకవర్గాల్లో పార్టీ నిమిత్తం లేకుండా స్వతహాగా కనీసం పదివేల ఓట్లు సంపాదించుకోగలిగిన నాయకులకు మాత్రమే టికెట్లు ఇస్తానని ఇటీవల ప్రకటించాడు. 2019 మోడల్ ఈసారి ఉండదని, 2024 లో ఖచ్చితంగా విజయం సాధించే మోడల్ ఉంటుందని పవన్ కళ్యాణ్ ఇటీవల చెబుతూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేయగానే- టికెట్లు అమ్ముకుంటున్నాడు అన్న ప్రచారం చేయడానికి ప్రత్యర్థి పార్టీలు వ్యూహాలను సిద్ధం చేశాయి. దీనికి సంబంధించిన సమాచారం ఉప్పందడంతో పవన్ కళ్యాణ్ తన పార్టీలో టికెట్లు మరియు పదవుల విషయంలో అత్యంత పారదర్శకత పాటిస్తామని, ఎవరు కూడా ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని బహిరంగంగా ప్రకటించి సంచలనం సృష్టించారు. పవన్ చేసిన ఈ ప్రకటన తో తమ వ్యూహాలను మళ్లీ మార్చుకోవాల్సిన అవసరం ప్రత్యర్థి పార్టీలకు ఏర్పడింది.
ఏది ఏమైనా పుకార్లు పుట్టకముందే వాటిని తుంచి వేసిన పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నికలకు పకడ్బందీగా సిద్ధం అవుతున్నాడని చెప్పకనే చెప్పినట్లు అయింది.