ప్రత్యేక హోదా అంశాన్ని ప్రజల్లో తామే సజీవంగా ఉంచామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎప్పటికప్పుడు చెబుతూ ఉంటారు. దాని తగ్గట్టుగా మొదట్లో వరుసగా అనంతపురం, కాకినాడ, తిరుపతుల్లో సభలు కూడా పెట్టారు. హోదాకి బదులు ప్రత్యేక ప్యాకేజీ కేంద్రం ప్రకటిస్తే… పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని విమర్శించారు. అయితే, ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి. ఆశించిన స్థాయి ఫలితాలు జనసేనకు రాలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రత్యేక హోదాపై.. గతంలో మాదిరగా ఉద్యమ స్ఫూర్తితో పవన్ ఉన్నారా, ఇప్పుడు కూడా కేంద్రం ఇవ్వని పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది, అధికార పార్టీ వైకాపా కూడా భాజపాని గట్టిగా అడగలేని స్థితిలో ఉంది, ఈ నేపథ్యంలో మరోసారి పవన్ హోదా అంశాన్ని ప్రముఖంగా తీసుకుంటారా..? అంటే, ఈ ప్రశ్నకు ఒక స్పష్టమైన సమాధానమే ఇవాళ్ల భీమవరంలో పవన్ ఇచ్చేశారు!
తెలంగాణకు అన్యాయం జరిగిందని ప్రజల్లో ఒక భావోద్వేగం ఉంది కాబట్టే, నాయకులు ముందుకు రాగానే ఉద్యమం తీవ్రతరం అయిందన్నారు. నష్టం జరుగుతున్నా దాన్ని చూస్తూ ఉండిపోతున్నారే ఇక్కడి ప్రజలు… అనే ఆవేదన తనకి ఉందన్నారు. విభజన తరువాత ఆంధ్రాకి అన్యాయం జరిగిందనీ, కేంద్రం ఇస్తామని చెప్పిన ప్రత్యేక హోదాను అడిగి తీసుకునే స్థాయిలో ఉన్న నాయకులూ పోరాటాలు చేసిన పార్టీలే దానికి తూట్లు పొడిచాయన్నారు. హోదా గురించి తానొక్కడినే మాట్లాడుతుంటే, అదేదో తన సరదాలా ఉందన్నారు! ప్రజల్లో భావోద్వేగం లేనప్పుడు, కోపం లేనప్పుడు, ఆవేదన లేనప్పుడు… లేని వాటిని ప్రజల్లో క్రియేట్ చేయలేమన్నారు పవన్. పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం సమయంలో మాట్లాడిన వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి, ఇవాళ్ల హోదా గురించి గట్టిగా నిలబడలేకపోతున్నారన్నారు. భాజపా అంటే భయమో, హోదా అంటే ఇష్టం లేకపోవడమో కారణాలు కావొచ్చన్నారు. ప్రజలకు కోరుకున్నప్పుడు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. ప్రత్యేక హోదా సాధనపై నాయకుల్లోనే బలమైన సంకల్పం లేనప్పుడు, వెనక నడవాల్సిన ప్రజల్లో బలం ఎలా ఉంటుందన్నారు!
పవన్ చెప్పేది ఏంటంటే… హోదా కావాలనే భావోద్వేగం ప్రజల్లో లేదని! ఇలా చెబుతూనే… పూర్తిగా ప్రజలపైనే నెపం నెట్టకుండా, నాయకుల్లో కూడా సంకల్పబలం లేదనీ చెప్పారు. ఒకటైతే వాస్తవం… ఇకపై ఒంటరిగా హోదా విషయమై పవన్ కల్యాణ్ గతంలో మాదిరిగా సభలూ సమావేశాలూ లాంటివి పెట్టరనేది ఆయన మాటల్లో చాలా స్పష్టంగా వినిపిస్తోంది.