తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో కూటమి కోసం చేస్తున్న ప్రయత్నాలు … జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు… సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్ లా అనిపించాయి. ఇదే అభిప్రాయాన్ని ఆయన తన రైలు యాత్రలో చెప్పారు. సినిమా రిలీజ్ ముందు ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేస్తారని.. చంద్రబాబు, రాహుల్ గాంధీ కలయిక … ఇతర పార్టీల నేతలతో.. కూటమి కోసం చర్చలు కూడా.. ప్రీరిలీజ్ ఫంక్షన్ లాగే ఉందన్నారు. మా అన్న కాంగ్రెస్లో ఉన్నప్పటికీ నేను రాష్ట్రం కోసం టీడీపీకి మద్దతు ఇస్తే.. టీడీపీ వెళ్లి అదే కాంగ్రెస్తో కలవడం ఎంతవరకు సమంజసమని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. చివరకు చంద్రబాబు ఎక్కడ మొదలయ్యారో అక్కడికే వెళ్లారని తేల్చారు. జగన్ పై జరిగిన కోడి కత్తి దాడిపైనా.. పవన్ కల్యాణ్ రైలు యాత్రలో తన అభిప్రాయం వ్యక్తం చేశారు. జగన్పై దాడి విషయంలో ప్రభుత్వం వెకిలిగా మాట్లాడ్డం సరికాదన్నారు. రాజకీయ జోక్యం లేకుండా విచారణ జరిపి వాస్తవాలు బయటపెట్టాలన్నారు.
జగన్ పై దాడిని షర్మిల, విజయమ్మే చేయిచారని.. టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ చేసిన విమర్శలపైనా… పవన్ కల్యాణ్ స్పందించారు. తల్లి, చెల్లి దాడి చేయించారనడం సరికాదు..కొడుకుపై తల్లి దాడి చేయిస్తుందా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య ఉందని.. తాను కొన్ని ఇబ్బందులు ఎదుర్కొననని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. చింతమనేని తీరు ఇంకా మారలేదన్నారు. పవన్ కల్యాణ్ విజయవాడ నుంచి తుని వరకు జనసేనానితో రైలు ప్రయాణించారు. జన్మభూమి ఎక్స్ప్రెస్లో నాదెండ్ల మనోహర్ తోపాటు.. మరికొంత మంది నేతలతో కలిసి వెళ్లారు. రైలులో ప్రయాణిస్తున్న రైతులు, విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికే యాత్రలు చేస్తున్నానని… అధికారం కోసం కాదన్నారు.
బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు కూటమి కోసం చేస్తున్న ప్రయత్నాలను… పవన్ కల్యాణ్ సినిమా ఫంక్షన్ తో పోల్చడం .. రాజకీయవర్గాలను సైతం ఆశ్చర్య పరిచింది. బీజేపీకి వ్యతిరేకంగా పెడుతున్న ఫ్రంట్ పై …అది వ్యతిరేక స్పందనే అన్న అభిప్రాయం అన్ని పార్టీల నేతల్లో ఉంది. ఏపీని మోసం చేసిన బీజేపీని పల్లెత్తు మాట అనకుండా… పవన్ రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు. జగన్ పై జరిగిన దాడి వ్యవహారంలో.. వైసీపీకే మద్దతు అన్నట్లుగా మాట్లాడారు. దీంతో పవన్ కల్యాణ్ … రాజకీయ విధానంపై మెల్లగా క్లారిటీ వస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.