జనసేన అధినేత పవన్ కల్యాణ్ తునిలో జరిగిన సభలో మాట్లాడారు! కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ గురించి స్పందించారు. ఈ సందర్భంగా తాను రాజకీయాల్లోకి ఎందుకొచ్చాననే అంశాన్ని మళ్లీ చెప్పారు. తనకు రాజకీయాల్లో మార్పు తేవడం ఆశయమన్నారు. గడచిన ఎన్నికల్లో రాష్ట్ర శ్రేయస్సును మాత్రమే దృష్టిలో ఉంచుకుని తాను పోటీ చేయలేదనీ, అనుభవం ఉన్న వ్యక్తి అని చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇచ్చానన్నారు. కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అని 2014లో అన్నానని పవన్ గుర్తుచేశారు. అన్న చిరంజీవి కాంగ్రెస్ లో ఉంటే వ్యతిరేకించి, ఆయన్ని బాధపెట్టి బయటకి వచ్చాను అన్నారు. తనవారందరినీ కాదని టీడీపీకి సపోర్ట్ చేస్తే, ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీతో ఫొటోలు దిగితే ఏమ్మాట్లాడాలని అన్నారు.
ఇదే అంశమై పవన్ ఇంకా చాలా మాట్లాడారు. అయితే, ఇక్కడ గమనించాల్సిన అంశం ఒకటుంది. తెలుగుదేశం పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటే ప్రస్తుతం జనసేనానికి ఇబ్బంది ఏంటి..? ఆయన టీడీపీతో ఇప్పుడు సఖ్యతతో లేరు కదా. 2019లో కూడా టీడీపీతో కలిసి పొత్తు పెట్టుకునే ఆలోచన జనసేనకు లేదు కదా. ఆయన కూడా టీడీపీకి వ్యతిరేకంగానే పోరాటం చేస్తున్నారు కదా. అలాంటప్పుడు తన అభిప్రాయాలకు అనుగుణంగా టీడీపీ నిర్ణయం లేదని పవన్ విమర్శించడం ఎంతవరకూ కరెక్ట్..?
సరే, జనసేన పాయింటాఫ్ వ్యూ నుంచే ఆలోచిద్దాం! అనుభవం ఉన్న నాయకుడు రాష్ట్రానికి అవసరమని గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇచ్చారు కదా. దాదాపు గడచిన ఏడాది వరకూ పవన్ కూడా టీడీపీకి అనుకూలంగా ఉంటూ వచ్చారు. కానీ, షడెన్ గా ఆయన కూడా రూటు మార్చేశారే..? దాన్నేమనాలి? పవన్ పాయింటాఫ్ వ్యూలో… తాను అనుకున్న విధంగా టీడీపీ పాలన లేదన్న నిర్ణయంతో టీడీపీకి దూరమయ్యారు! మరి, పవన్ కు ఇలా మారిపోయే స్వేచ్ఛ ఉన్నప్పుడు, అదే స్వేచ్ఛ వేరే రాజకీయ పార్టీకి ఉంటుంది కదా. రాష్ట్రానికి భాజపా మేలు చేస్తుందని టీడీపీ ఆశించి, నాలుగున్నరేళ్లు కేంద్రంలో మద్దతుగా నిలిచారు. కానీ, అది జరగలేదు. కాబట్టి, ఇప్పుడు ప్రత్యామ్నాయ మద్దతుదారుడిని వెతుక్కోవాల్సిన అవసరం ఏర్పడింది. అయితే, చంద్రబాబు నాయుడు తీసుకున్న తాజా నిర్ణయం ప్రభావం ఏంటనేది రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో నిర్ణయిస్తారు. అంతేగానీ… ఒక పార్టీ పొత్తుల వ్యవహారాల్లో మార్పులూ చేర్పులను మరో రాజకీయ పార్టీ ప్రశ్నించే స్థాయిలో ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే, ఆయా కాలమాన పరిస్థితుల ప్రకారం పొత్తులూ ఎత్తులూ అనేవి రాజకీయాల్లో అనివార్యం. కాబట్టి, పవన్ ఇంతగా ఇదై పోవాల్సిన అవసరం లేదు. టీడీపీతో ఇప్పటికీ సఖ్యతగా ఉండి, ఇలాంటి విమర్శలు ఆయన చేసినా కొంత అర్థవంతంగా ఉండేది.