వైరస్ నివారణ చర్యల విషయంలో ప్రభుత్వానికి మద్దతుగా ఉండాలని విమర్శించకూడదనుకున్న పవన్ కల్యాణ్.. మనసు మార్చుకున్నట్లుగా కనిపిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలసత్వం వల్లే ఇప్పుడు ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోందన్న అభిప్రాయానికి వచ్చారు. మెల్లగా విమర్శలు ప్రాంభించారు. అనంతపురం జిల్లా జనసేన నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన పవన్ కల్యాణ్… ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధ్యతా రాహిత్యంగా.. జ్వరం వంటిదే కరోనా అని చెప్పడం వల్లే.. అధికారుల్లో నిర్లక్ష్యం వచ్చిందని విమర్శించారు.
తేలికగా తీసుకోవడం వల్లనే.. వైరస్ నుంచి ప్రజల్ని కాపాడేవిధంగా సరైన రక్షణ చర్యలు తీసుకోలేదని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పాలనా యంత్రంగం.. అప్రమత్తంగా.. వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రీన్, ఆరెంజ్ జోన్లు.. రెడ్ జోన్లుగా మారితే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందన్నారు. ప్రజారోగ్యం విషయం కేరళ వంటి రాష్ట్రాలు ముందస్తుగా తీసుకున్న జాగ్రత్తలను పవన్ కల్యాణ్ ఉదహరించారు. ఆంధ్రప్రదేశ్ క్వారంటైన్ కేంద్రాల్లో అసలు సౌకర్యాలు బాగో లేవని.. ఆరోగ్య శాఖ పటిష్టంగా లేని దుష్ఫలితం… కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. లాక్ డౌన్ ఎత్తివేత తర్వాతే అసలు ముప్పు ఉంటుందని నిపుణులు చెబుతున్నారని.. ప్రభుత్వం నిర్లక్ష్యం వదిలి.. మరింత జాగ్రత్తగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
ప్రభుత్వంపై పోరాడాల్సిన సమయం వచ్చిదని.. రైతులు.. కూలీలు , చేనేత కళాకారులు సహా నష్టపోయిన ప్రతి ఒక్కరి కోసం జనసైనికులు తమ గళం వినిపించాలని ఆదేశించారు. అనంతపురం జిల్లాకు ప్రభుత్వం చేసిందేమీ లేదనన్నారు. ప్రజా సమస్యలపై అందుబాటులో ఉన్న మాధ్యమాల ద్వారా బలంగా జనసేన వాయిస్‌ను వినిపించాలని పవన్ ఆదేశించారు. ఇప్పటి వరకూ..తనను రెచ్చగొట్టినా.. పవన్ కల్యాణ్ నియంత్రణ పాటించారు. ఇక ముందు అవసరం లేదని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.ఇక ప్రభుత్వ వైఫల్యం ఆయన విరుచుకుపడే అవకాశం ఉంది.