ఏపీ సర్కారు కొత్త ఇసుక విధానం అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. గతం కంటే తక్కువ ధరకే ఇసుక ఇస్తామనీ, టీడీపీ హయాంలో కంటే చాలా తక్కువ ఖర్చుతో వినియోగదారులకు ఇసుక చేరుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అంతేకాదు, డిమాండ్ ని దృష్టిలో పెట్టుకుని ఇసుక స్టాక్ పెంచుకోవాలని కూడా అధికారులను ఆదేశించారు. కొత్త విధానం అమల్లోకి వచ్చాక… పరిస్థితి ఎలా ఉందన్న అంశంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ దృష్టి పెట్టారు. గుంటూరు జిల్లా నౌలూరులో ఇసుక స్టాక్ యార్డులో పవన్ తనిఖీ చేశారు. కొత్త విధానం అమ్మలోకి వచ్చాక ఇసుక తవ్వకాలు, సరఫరా ఎలా ఉందనేది పవన్ పరిశీలించారు.
చెప్పడానికి టన్ను రూ. 375కే ఇసుక ఇస్తున్నామని చెప్తున్నారుగానీ, ఇక్కడి నుంచి ఇసుక కదిలేసరికి దాదాపు రూ. 900 కట్టాల్సి వస్తోందన్నారు పవన్. అదనంగా రూ. 525 వసూలు చేస్తున్నారనీ, కొనుగోలు చేసిన ఇసుకను తరలించుకోవడానికి కిలోమీటర్ కు కొంత చొప్పున అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి ఉందన్నారు. తక్కువ ధరకే ఇస్తున్నామని ప్రకటనలు చేస్తూ ప్రజలను తప్పుతోవ పట్టిస్తున్నారనేది తనకు కొందరు చెప్తున్న విషయం అన్నారు. ప్రభుత్వం అంతా పారదర్శకంగానే ఇసుక విధానం అమలు చేస్తున్నామని చెబుతోంది కానీ… పారదర్శకంటే రూ. 375 అని చెప్పడం కాదనీ… 900లకి అమ్ముతున్నామని చెప్పాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుక ఆదాయం ప్రైవేటు వ్యక్తులకు వెళ్లిపోయిందనే విమర్శలు వచ్చాయన్నారు. అందుకే, గతంలో తన దృష్టికి వచ్చిన నాయకుల పాత్రపైనా, పార్టీల విధానంపైనా పోరాటం చేశామన్నారు. ఇప్పుడు కూడా కొత్త ఇసుక విధానంపై సమగ్ర అధ్యయనం చేస్తామనీ, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, భవన నిర్మాణాలు మరింత భారమైపోతున్నాయని ఇప్పటికే కొందరు అంటున్నారనీ, ఇవన్నీ పరిగణనలోకి తీసుకు త్వరలో ఆలోచిస్తామని పవన్ చెప్పారు.
ప్రభుత్వాన్ని అదే పనిగా అడ్డగోలుగా విమర్శించాలని లేదని చెబుతూనే… దీనిపై ఒక నివేదిక సిద్ధమయ్యాక ఆలోచిస్తామని పవన్ అంటున్నారు.కొత్త ఇసుక విధానంలో లోపాలపై జనసేన అధ్యయనం ప్రారంభమైందనే చెప్పాలి. ఇసుక కొరత వల్ల కష్టాలు ఎదుర్కొంటున్నవారి తరఫున జనసేన ఏదో ఒక కార్యాచరణ చేపట్టే ఉద్దేశంలో ఉందనేది పవన్ మాటల్లో అర్థమౌతోంది. కొత్త విధానం అమల్లోకి వచ్చి కొద్దిరోజులే అయింది కాబట్టి, ప్రస్తుతం ఉన్న కొరత, కొత్త ధరలపై మరింత స్పష్టత రావడానికి కొంత సమయం పడుతుంది.