తెలుగు సినిమా ప్రముఖుల్లో అర్హులందర్నీ పద్మ పురస్కారాలతో కేంద్ర ప్రభుత్వాలు సత్కరించేశాయా? ఇక, మిగిలిన వాళ్లల్లో పద్మ పురస్కారాలు అందుకునే అర్హత ఎవరికీ లేదా? ఇప్పుడివే ప్రశ్నలు అటు సినిమా ప్రముఖుల్లో, సగటు ప్రేక్షకుల్లో తలెత్తుతున్నాయి. 2018 ఏడాదికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో తెలుగు సినిమా ప్రముఖులకు మొండిచెయ్యి మాత్రమే మిగిలిందని తెలుగు360.కామ్ ఉదయమే తెలిపింది. తెలుగు సినిమా జనాలెవరూ ఈ పద్మ పురస్కారాలపై పెద్దగా స్పందించలేదు. కాని సినీ నటుడు కమ్ రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. జనసేన పార్టీ ఆఫీసులో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న పవన్, పద్మ పురస్కారాలపై సుతిమెత్తగా చురకలు అంటించారు. బాడ్మింటన్ క్రీడాకారుడు, తెలుగువాడు శ్రీకాంత్ కిదాంబికి శుభాకాంక్షలు తెలుపుతూ… మరింతమంది తెలుగువారికి పురస్కారాలు వచ్చి ఉంటే బాగుండేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. స్వర్గీయ ఎస్వీ రంగారావు, మహానటి సావిత్రిలకు మరణానంతరం పద్మ పురస్కారాలు ఇచ్చినా సముచితంగా ఉంటుందన్నారు. సాధారణంగా చాలా సమస్యలపై స్పందించడానికి పవన్ సుముఖత వ్యక్తం చేయరు. అటువంటిది రిపబ్లిక్ డే వేడుకల్లో పద్మ పురస్కారాలపై పని గట్టుకుని స్పందించారంటే అర్థం ఏంటి? ఒకవేళ పవన్ అనుకుంటే… శ్రీకాంత్ కిదాంబి, ఇళయరాజాలకు శుభాకాంక్షలు చెప్పి ఊరుకోవచ్చు. సుతిమెత్తగా పద్మ పురస్కారాల్లో తెలుగు సినిమా ప్రముఖులకు జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించారు. దీనర్థం… కేంద్ర ప్రభుత్వ వైఖరి పవన్కీ నచ్చలేదనా?