ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజమండ్రి సభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్, వైఎస్ఆర్ సీపీ నేత కన్నబాబు పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కన్నబాబు గురించి ప్రజారాజ్యం నాటి ఆసక్తికరమైన అంశాలు వివరిస్తూనే, కన్నబాబుపై విమర్శల వర్షం కురిపించారు.
అప్పట్లో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకబడిన తరగతులవారు ఉండే ఒక బస్తీని ఖాళీ చేయిస్తే, అక్కడ ఆడపిల్లలు స్నానం చేయడానికి కూడా కష్టతరమైన పరిస్థితులు ఏర్పడిన సమయంలో ఆ కడుపు మంటతో కాంగ్రెస్ నేతలను పంచలు ఊడదీసేలా తరిమి తరిమి కొట్టండి అని తాను వ్యాఖ్యానిస్తే, అప్పుడు ప్రజారాజ్యం లో ఉన్న నేతల లో అందరికంటే ముందు పారిపోయిన వ్యక్తి కన్నబాబు అని గుర్తుచేస్తూ, అంత ధైర్యస్థుడు ఈ కన్నబాబు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
అసలు ఈ కన్నబాబుని ప్రజారాజ్యం సమయంలో చిరంజీవి దగ్గరకి తీసుకెళ్ళిందే తానని, తాను, నాగబాబు లాంటి వాళ్లు ప్రజారాజ్యంలో ఏ పదవి కోరుకోకపోయినప్పటికీ, ఏ టికెట్ తీసుకోక పోయినప్పటికీ, కన్నబాబు కు మాత్రం టికెట్ ఇప్పించామని, కానీ ఇప్పుడు అదే కన్నబాబు జన సైనికులని వేధిస్తున్నాడని పవన్ కళ్యాణ్ అన్నారు. అసలు ఏదో ఊరు నుండి ఇక్కడకు వచ్చి ఎమ్మెల్యే గా ఉంటున్నాడు అంటే అది ప్రజారాజ్యం సమయంలో చిరంజీవి చేసిన సహాయం వల్లే అని పవన్ కళ్యాన్ చెప్పుకొచ్చారు.
అదే సమయంలో కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడిన జగన్ పై మాట్లాడే ధైర్యం కన్నబాబు కి లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇలాంటి వ్యక్తులను బహుజన సమాజ్ వాది పార్టీ నేత కాన్షీరామ్ అప్పట్లో చెంచాలు అని పిలిచే వాడని, దానర్థం ఇలాంటి నేతలు తనకంటే పైనున్న ఒక నేత ఆడించినట్లల్లా ఆడుతూ ఉంటారని, అలాంటి వాళ్ళను చెంచా అంటారని, కన్నబాబు జగన్ యొక్క చెంచా అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.