మంచు విష్ణు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో ఏకీ భవించడం లేదని చెప్పడమే కాదు తాను ఇండస్ట్రీ వైపు ఉన్నానని ప్రకాష్ రాజ్ పవన్ వైపు ఉన్నారని చెప్పుకొచ్చారు. అంటే పవన్ మాటలను ఇండస్ట్రీ వ్యతిరేకిస్తోందని విష్ణుచెప్పదల్చుకున్నారు. అదే సమయంలో పవన్ వ్యాఖ్యలను వ్యతిరేకించేవారందరూ తనకే ఓటు వేయాలన్నట్లుగా ఆయన మాట్లాడారు. దీంతో మా ఎన్నికల ఎజెండా పవన్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్నట్లుగా మార్చేశారన్న అభిప్రాయంవినిపిస్తోంది.
ప్రభుత్వం – పవన్ కల్యాణ్ మధ్య సినీ ఇండస్ట్రీ సమస్యల విషయంలో ఏర్పడిన వివాదాన్ని మంచు విష్ణు “మా” ఎన్నికలకు ముడి పెట్టారు. తనను తాను ఇండస్ట్రీ వైపు ఉన్నానని చెప్పుకున్నారు. పవన్ కల్యాణ్ మంచి నాయకుడని.. మార్పు కోసం పని చేస్తున్నాడని ప్రకాష్ రాజ్ పవన్‌ను అభినందించారు. విష్ణు వ్యాఖ్యల వల్ల మా ఎన్నికల అజెండా మారిపోయింది. “మా” ఎన్నికల్లో మంచు విష్ణుకు అత్యధిక ఓట్లు పడి ఆయన ప్యానల్ గెలుపొందితే.. ఏపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలో నిజం లేదని ..ప్రభుత్వం అంటే సినీ ఇండస్ట్రీకి మంచి అభిప్రాయం ఉందని అనుకోవాల్సి ఉంటుంది.
ఒక వేళ ప్రకాష్ రాజ్ ప్యానల్‌కు అత్యధిక ఓట్లు లభిస్తే పవన్ కల్యాణ్ వాదానికే ఇండస్ట్రీ మొగ్గు ఉందని భావించాల్సి ఉంటుంది. ఎంత ఎక్కువ మెజార్టీ ఎవరికి వస్తే వారి వాదానికే బలం ఉన్నట్లుగా భావించే పరిస్థితి ఏర్పడుతోంది. మంచు విష్ణు కావాలని చేశారో.. వ్యూహాత్మకంగా చేశారో కానీ ఎజెండా మాత్రం సెట్ అయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ కోణంలోనే ఎన్నికలు జరిగితే టాలీవుడ్ ఎటు వైపో తేలిపోతుందంటున్నారు.