బహుశా ఈ రాజకీయ వ్యాఖ్యల మీద పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అభిమానుల్లో విపరీతమైన అలజడి చెలరేగుతుందేమో! హిజ్రాతో పోల్చబడినది మామూలు వ్యక్తి కాదు.. జనాల్లో విపరీతమైన క్రేజ్, జనాదరణ ఉన్న హీరోగా భావించే పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్. పైగా కామెంట్ చేసింది ఏదో దారిన పోయే దానయ్య కాదు.. పట్టించుకోకుండా వదిలేయడానికి! ఆయన సీపీఐ పార్టీకి జాతీయస్థాయి నాయకుడు నారాయణ. ఇంతకూ ఏం అన్నారంటే.. ‘పవన్ కల్యాణ్ శిఖండి లాగా చంద్రబాబునాయుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడెల్లా ఆదుకోవడానికి తెరమీదకు వస్తున్నాడంటూ’ నిప్పులు చెరిగారు. అప్పుడప్పుడూ రాజకీయ ప్రకటనలు గుప్పిస్తూ.. ఏదో తన మానాన తాను సినిమాలు చేసుకుంటూ రోజులు వెళ్లబుచ్చే పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ గురించి ఇంత తీవ్రమైన వ్యాఖ్య చేశారంటే ఆశ్చర్యమే.
వివరాల్లోకి వెళితే.. ముద్రగడ పద్మనాభం దీక్ష విరమించేయడం అనేది చంద్రబాబునాయుడును వ్యతిరేకించి రాజకీయ పక్షాలు చాలా మందికి మింగుడుపడలేదు అన్నమాట వాస్తవం. ఇలాంటి అసంతృప్తి సీపీఐ నారాయణలో కూడా ప్రబలినట్లుంది. చెన్నైలో మీడియాతో మాట్లాడిన నారాయణ కాపుగర్జన సందర్భంగా జరిగిన సమస్త హింసాత్మక ఘటనలకు బాధ్యత చంద్రబాబుదే అని వ్యాఖ్యానిస్తూనే ఆయన మీద చెలరేగిపోయారు. అయితే ముద్రగడ దీక్షను సమర్థించిన నారాయణ అదే సమయంలో భార్యతో కూడా దీక్ష చేయించడం అంటే.. అది గృహహింస చట్టం కిందికి వస్తుందంటూ ముద్రగడ మీద కేసు పెట్టాలన్నట్లుగా మాట్లాడారు. అక్కడికేదో ముద్రగడ భార్యకు ఈ సమస్య, దీక్ష మీద ఎలాంటి ఉద్దేశమూ లేదని, భర్త బలవంతం మీద మాత్రమే ఆమె దీక్షకు కూర్చున్నారని కించపరిచేలా నారాయణ మాట్లాడడం విశేషం.
హఠాత్తుగా నారాయణ ఆవేశం పవన్‌కల్యాణ్ మీదకు మళ్లింది. తెలుగు ప్రజలంతా పవర్‌స్టార్‌గా చూసే పవన్‌కల్యాణ్ ఆయనకు మాత్రం శిఖండిలాగా కనిపించాడు.
మహాభారత సంగ్రామంలో పాండవుల తరఫున భీష్ముడిని అంతం చేయడానికి వచ్చిన ఆ కాలంనాటి హిజ్రా శిఖండి అనే కథ అందరికీ తెలిసిందే. పవన్‌ను శిఖండితో పోలుస్తూ.. రాజకీయ ఇబ్బందులు వచ్చినప్పుడల్లా చంద్రబాబును బయటపడేయడేయడానికి పవన్ వస్తుంటారంటూ నారాయణ్ నిప్పులు చెరిగారు. ప్రస్తుత ఎపిసోడ్లో పవన్ కల్యాణ్ జోక్యం చేసుకుని చేసిన మేలు ఏమున్నదో.. ఏదో రెండు ట్వీట్లు తప్ప ఆయన ఏం హెల్ప్ చేసినట్లుగా నారాయణకు అనిపిస్తున్నదో అర్థం కావడం లేదు.