జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో హడావుడి చేసిన సంగతి తెలిసిందే. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకూ ఆయన ఛాంబర్ లోనే ఉన్నారు. మద్దతుగా మెగా ఫ్యామిలీ అంతా వచ్చింది. తన తల్లిని దూషించిన వ్యవహారంపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ, న్యాయపరంగా పోరాటం చేయాలని మెగా ఫ్యామిలీ సమాలోచనలు జరిపింది. కొంతమంది న్యాయవాదులతో చర్చించారు కూడా! అయితే, అనూహ్యంగా పవన్ అభిమానులు పెద్ద ఎత్తున ఛాంబర్ దగ్గరకి వస్తుండటంతో వారిని అదుపు చేయడం పోలీసులకు కాస్త ఇబ్బందిగా మారింది. ఆ తరువాత, ఫిల్మ్ ఛాంబర్ నుంచి పవన్ బయటకి వెళ్లిపోయారు. ప్రెస్ మీట్ నిర్వహిస్తారని అనుకుంటే అది కూడా లేదు!
విశ్వసనీయ సమాచారం మేరకు ఫిల్మ్ ఛాంబర్ లోపల జరిగిన వ్యవహారం ఏంటంటే… తనపై కుట్ర జరుగుతోందనీ, చర్యలు తీసుకోవాలంటూ ఒక ఫిర్యాదు పత్రాన్ని పవన్ నింపారట! మంత్రి నారా లోకేష్ తోపాటు టీవీ 9 రవిప్రకాష్, శ్రీనిరాజు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ… ఇలా కొంతమంది తనపై కుట్ర చేస్తున్నారని పవన్ అన్నారు కదా! సరే, దీనికి సంబంధించిన ఆధారాలు ఏవైనా ఉన్నాయా అని అడిగితే… పవన్ నుంచి సమాధానం లేదట! అక్కడ పనిచేస్తున్నవారు కొంతమంది చెబితే విన్నానని పవన్ చెప్పినట్టు తెలుస్తోంది. అంతకుమించి తన దగ్గర ఆధారాలంటూ ఏవీ లేనట్టుగా పవన్ స్పందించారని సమాచారం. అంతే.. అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టి, రేపు వస్తానని చెప్పి పవన్ బయలుదేరి వెళ్లిపోయారని విశ్వసనీయ సమాచారం.
పవన్ వ్యవహార శైలి గురించి ఇంతకుముందు కథనాల్లో చర్చించుకున్నాం! ఆయనకి ఎవరో ఏదో చెబితే చాలు… వెంటనే స్పందించేసి బయలుదేరేస్తారు. గతంలో మంత్రి నారా లోకేష్ పై అవినీతి ఆరోపణలపై కూడా ఇలానే చెప్పారు కదా! నిజానికి, పవన్ కల్యాణ్ తల్లిని వివాదంలోకి లాగిన సందర్భంలో మీడియా కూడా పవన్ కి మద్దతుగా నిలిచింది. శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యల్ని అందరూ తప్పుబట్టారు. కానీ, ఆ అంశంపై వేరే కోణం నుంచి పవన్ రియాక్ట్ అయ్యారు. దానికి రాజకీయ కోణం జోడించి, దానికి మీడియాలో ఒక వర్గం కుట్ర చేస్తోందన్న వాదన దట్టించి పోరాటమంటూ ఛాంబర్ కి బయలుదేరేశారు. దీక్ష చేస్తారన్నారు! కానీ, వీటన్నింటికంటే ముందు తాను చేయబోతున్న పోరాటానికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలు ఉండాలనే విషయాన్ని పవన్ ప్రతీసారీ మరచిపోతున్నారు..!