ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను చంద్రబాబు నేడో రేపో ఖరారు చేయనున్నారు. ఎవరెవరు అభ్యర్థులు అన్నదానిపై చంద్రబాబుకు ఓ స్పష్టత ఉంది. అయితే ఆయన టైమింగ్ చూసి ఆశావహులు అసంతృప్తి చెందకుండా చూసి ప్రకటిస్తారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆయనను ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్న వారంతా కలుస్తున్నారు. వారి వాదన వారు వినిపిస్తున్నారు. అయితే నాగబాబుకు ఓ ఎమ్మెల్సీ ఖాయమని ఎప్పుడో స్పష్టత వచ్చింది. అయితే ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీపై ప్రచారం జరుగుతోంది. కానీ అలాంటిదేమీ లేదని అంటున్నారు. అసలు ఈ ప్రచారం ఎందుకు జరుగుతోంది. .?
చంద్రబాబుతో గంటకుపైగా పవన్ చర్చలు
ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో పవన్ కల్యాణ్.. అసెంబ్లీలోని చంద్రబాబు చాంబర్ లో దాదాపుగా గంటకుపైగా చర్చలు జరిపారు. ప్రధానంగా ఎమ్మెల్సీ స్థానంపై చర్చించారు. నాగేంద్రబాబుకు ఎమ్మెల్సీని గతంలోనే ఖరారు చేశారు. మంత్రి పదవిని కూడా ఇస్తామని చెప్పారు. అయితే ఇప్పుడు పవన్ కల్యాణ్ ఆలోచన మార్చుకున్నారని అంటున్నారు. నాగబాబు మంత్రిగా ఉండటం కన్నా.. వేరే ఏదైనా కీలకమైన కార్పొరేషన్ కు చైర్మన్ గా నియమిస్తే మంచిదన్న ప్రతిపాదనను పవన్ .. చంద్రబాబు ముందు పెట్టారని చెబుతున్నారు. అందుకే నాగబాబు ఎమ్మెల్సీ, మంత్రి పదవిపై చర్చలు ప్రారంభమయ్యాయి.
అంతా పవన్ ఇష్టమే !
పవన్ కల్యాణ్ గతంలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడినప్పుడు నాగబాబును ఎమ్మెల్సీ చేసిన తర్వాత మంత్రిగా ప్రమాణం చేస్తారని చెప్పారు. అప్పట్లోనే ఆయనకు ఏ ఏ శాఖలు కేటాయిస్తారన్న దానిపై ఊహాగానాలు కూడా వచ్చాయి. కేబినెట్ లో ఒక్క సీటు ఖాళీగా ఉంది. ఆ సీటు నాగబాబుకేనని క్లారిటీ వచ్చింది. అయితే ఇప్పుడు పవన్ కల్యాణ్ నాగబాబు మంత్రిగా ఉండటం కన్నా నామినేటెడ్ పోస్టులో ఉండటం మంచిదని అనుకుంటున్నారు. అందుకే ఆలోచిస్తున్నారని అంటున్నారు. సామాజిక సమీకరణాలు, ఇతర విషయాలను పరిగణనలోకి తీసుకుని పవన్ తుది నిర్ణయం తీసుకోనున్నారు.
ఎమ్మెల్సీ ఖాయమే – మంత్రి పదవే డౌట్ !
నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి విషయంలో ఎలాంటి సమస్యా లేదని.. జనసేన వర్గాలు కూడా చెబుతున్నాయి. వంద శాతం ఆయనకు ఎమ్మెల్సీ సీటు ఖరారవుతుందని చెబుతున్నారు. అయితే మంత్రి పదవి విషయంలోనే డైలమా ఉందని .. పవన్ కల్యాణ్ ఈ విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు.