ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు, ఆపద సమయంలో, ప్రజల్ని ఆదుకోవాల్సిన పరిస్థితులో.. అందరికంటే ముందే స్పందిస్తుంటుంది చిత్రసీమ. స్టార్లు ధారాళంగా విరాళాలు అందిస్తుంటారు. కరోనా సమయంలోనూ, ఇప్పుడు… హైదరాబాద్‌కి వరదల సమయంలోనూ స్టార్లు ముందుకొచ్చారు. కోట్లకు కోట్లు విరాళాలు ప్రకటించారు. అయినా సరే.. ఓ వర్గంలో కాస్త అంతృప్తి ఉండనే ఉంటుంది. `సినిమాకి కోట్లకు కోట్లు తీసుకుంటారు. విరాళాలు మాత్రం గీచి గీచి ఇస్తారు` అంటూ ఎద్దేవా చేస్తుంటారు. అంతేకాదు.. స్పందించడంలో ఏమాత్రం ఆలస్యం చేసినా – `వీళ్లకు ప్రజలంటే ప్రేమలేదా` అంటూ నిలదీస్తారు. ఇవన్నీ సినిమా వాళ్ల గుండెల్ని గుచ్చుకునే విషయాలే. సినిమా వాళ్లు రీలు జీవితంలోనే హీరోలని, బయట జీరోలని వేళాకోళం చేసేవాళ్లకు ధీటుగా సమాధానం ఇచ్చాడు పవన్‌కల్యాణ్.
సినిమావాళ్లకు ఫేమ్, క్రేజ్ ఎక్కువగా ఉంటుందని, డబ్బులు తక్కువగా ఉంటాయని నిజాయతీగా చెప్పుకొచ్చాడు. సినిమా పరిశ్రమలో ఓ సీజన్ కి పెట్టుబడి రెండు మూడొందల కోట్లు మాత్రమే అని, సినిమాల ద్వారా నటీనటులు సంపాదించేదానికంటే, వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలు సంపాదించేది ఎక్కువని, ఓ వ్యక్తిని వేలెత్తి నిందించేటప్పుడు, మిగిలిన మూడు వేళ్లూ తమవైపే ఉంటాయన్నది గమనించుకోవాలని సూచించాడు. `సినిమా వాళ్లు తక్కువగా ఇస్తారు అన్నవాళ్లెవరూ జేబులోంచి డబ్బులు తీసి ఇవ్వరు` అంటూ కుండ బద్దలు కొట్టాడు. “ఎం.ఎల్.ఏగా నిలబడేవాళ్లు గెలవడానికి కోట్లకు కోట్లు ఖర్చు పెడతారు. ఓ ఎం.ఎల్.ఏ దాదాపు 150 కోట్లు ఖర్చు పెట్టిన దాఖలాలు ఉన్నాయి. రాజకీయాల్లోకి వచ్చేది సేవ చేయడానికే కదా..? ఎన్నికల్లో ఖర్చు పెట్టేదేదో.. ఇప్పుడు ఇలాంటి వైపరిత్యాలు జరిగినప్పుడు ఖర్చు పెట్టొచ్చు కదా“ అని ప్రశ్నించాడు. “సినిమా అనేది సమష్టి కృషి. బయటి నుంచి చూసేవాళ్లకు కోట్లకు కోట్లు కనిపిస్తాయి. కానీ ఓ సినిమా పోతే నిర్మాత ఆస్తుల్ని అమ్ముకోవాల్సివస్తుంది. `ఆరెంజ్` సినిమా పోతే.. అన్నయ్య నాగబాబు ఆస్తుల్ని అమ్ముకున్నాడు. మేం తలో చేయి వేసి బయట పడేశాం. పది కోట్లు పెట్టి సినిమా తీస్తే.. వంద కోట్లలా అనిపిస్తుంది. చివరికి కోటి మిగలొచ్చు. అవి కూడా రాకపోవొచ్చు. కరోనా సమయంలో.. పనులన్నీ ఆగిపోయాయి. ఆర్థిక వ్యవస్థ స్థంభించిపోయింది. ఆ సమయంలో సినిమా వాళ్లు విరాళాలు అందించాల్సివచ్చింది. నిజానికి అప్పుడు మాక్కూడా పని లేదు కదా. అక్షయ్ కుమార్ లాంటి వాళ్లు పాతిక కోట్లు సాయం అందించారు. నేను కోటి ఇచ్చాను. అది ఆయన స్థాయి, ఇది నా స్థాయి. ఎవరి పరిధిలో వాళ్లు సాయం చేసుకుంటూ వెళ్లారు. `మీరెందుకు సాయం చేయలేదు` అని ఎవరికీ అడిగే హక్కు లేదు. ఇది బాధ్యతగా భావించి చేయాలంతే. ఇప్పుడు నేనెందుకు అడుగుతున్నానంటే.. నేను సాయం చేశా కాబట్టే“ అని చెప్పుకొచ్చాడు పవన్.
తెలంగాణ ప్రభుత్వానికి సాయం చేసిన హీరోలు, ఆంధ్ర ప్రభుత్వానికి ఎందుకు విరాళాలు ప్రకటించలేదు? అనే మరో ప్రశ్న కూడా ఇప్పుడు తలెత్తుతోంది. దీనిపై కూడా పవన్ వివరంగానే సమాధానం చెప్పాడు. “తెలంగాణలో యాక్టీవ్ సీఎం ఉన్నారు. ఆయన విరాళాలు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దాంతో.. మేమంతా స్పందించాం. ఏపీలో కూడా సీఎం యాక్టీవ్ అయి, అక్కడి ప్రభుత్వం.. అడిగితే ఇచ్చేవాళ్లం” అంటూ వివరణ ఇచ్చాడు. పవన్ చెప్పింది పాయింటే. విపత్తు జరిగిన ప్రతీసారీ.. సినిమా వాళ్లే ఎందుకు స్పందించాలి? `అసలు ఎందుకు ఇవ్వరు` అని అడిగే హక్కు ఎవరికి ఉంది? సినిమా వాళ్లంలా ఎప్పుడూ లాభాలేనా? పది సినిమాలు తీస్తే అందులో ఒకటి మాత్రమే హిట్టన్న సంగతి అందరికీ తెలుసు. ఓ సినిమా తీసి, ఆస్తులన్నీ అమ్ముకున్న నిర్మాతలెందరో? వాళ్ల కష్టాలు వాళ్లకున్నాయి. అయినా సరే, ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు ప్రతీసారీ ముందుకు వస్తూనే ఉన్నారు. వాళ్ల సాయాన్ని, సేవా భావాన్ని అందరూ గుర్తించాల్సిందే.