పవన్ నాయుడూ అంటూ.. తనపై ఒంటికాలితో లేస్తున్న వైసీపీ నాయకులకు.. జనసేన అధినేత సింపుల్ గా కౌంటర్ ఇచ్చారు. జగన్ రెడ్డి అని పిలిచినందుకే.. తనకు దురుద్దేశాలు ఆపాదిస్తున్నారని.. 151 మంది ఎమ్మెల్యేలు తీర్మానం చేసి…ఏ పేరుతో పిలవాలో.. తనకు పంపితే.. అదే పేరుతో పిలుస్తానని.. ప్రకటించారు. సమష్టిగా నిర్ణయం తీసుకొని ప్రజలకు చెబితే.. అదే పేరుతో పిలుస్తారన్నారు. ముఖ్యమంత్రి పేరు జగన్ రెడ్డి కాబట్టి.. జగన్ రెడ్డి అని పిలిచానని అందులో తప్పేముందున్నారు. జాతీయ మీడియా కూడా జగన్ రెడ్డి అనే సంబోధిస్తుందని గుర్తు చేశారు. పవన్ నాయుడు అని వైసీపీ నేతలు ఎగతాళి చేస్తున్నారని మండిపడ్డారు. బొత్సను బొత్స నాయుడు అంటే.. బాగుంటుందా అని ప్రశ్నించారు.
అంతే కాదు.. మతం మార్చుకున్నా కూడా.. జగన్ కులం పేరు తగిలించుకుంటున్నారని… విమర్శించారు. జగన్ క్రిస్టియన్ మతాన్ని గౌరవిస్తారు.. దాన్ని దాచుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. జగన్ ఆయన తిరుపతి ప్రసాదం తింటారో లేదో తెలియదని వ్యాఖ్యానించారు. బొత్స తనపై చేసిన విమర్శలను పవన్ కల్యాణ్ లైట్ తీసుకున్నారు. తను నన్ను తిడితే బొత్సకు 2 నెలలు మంత్రి పదవి పెరుగుతుంది తప్ప.. మరే ప్రయోజనం ఉండదన్నారు. తన పెళ్లిళ్ల గురించి, భార్యల గురించి మాట్లాడుతున్న జగన్‌కు… బొత్స ముందుగా మాట్లాడటం నేర్పాలని.. పవన్ సూచించారు. విడిపోయి ఎవరికి వాళ్లుగా బతుకుతున్నామని.. వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడటానికి ఇంగిత జ్ఞానం ఉండాలన్నారు. మంత్రి బొత్స తమ నాయకుడికి చెప్పాలని సూచించారు. తామంతా ఒకే జాతి అన్న భావన తెలంగాణలో ఉందని.. కానీ.. ఏపీ లో మాత్రం అందరూ కులాల వారీగా విడిపోయారన్నారు. సమస్యలని పక్కదారి పట్టించడానికి వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని విమర్శించారు.
పవన్ కల్యాణ్ జగన్ రెడ్డి అని సంబోధించడంతో.. వైసీపీ మంత్రి పేర్ని నాని అత్యుత్యాహానికి పోయి.. పవన్ నాయుడు అంటూ సంబోధించారు. అది మిస్ ఫైర్ అయిన సూచనలు కనిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డిని షార్ట్ కట్లో చాలా మంది జగన్ .. జగన్ రెడ్డి అని సంబోధిస్తూ ఉంటారు. దానికే అంతగా ఓవర్ రియాక్ట్ కావాల్సిన అవసరం ఏముందని.. అది కూడా..పవన్ కల్యాణ్‌కు కులం అంటగట్టి.. ఆయనను కించ పరిచే ప్రయత్నం చేయడం ఎందుకన్న చర్చ.. వైసీపీలోనే నడుస్తోంది. పవన్ కల్యాణ్ వ్యూహాత్మకంగా.. దీన్ని ఉపయోగించుకుంటూ.. వైసీపీ ఎలా కుల వివక్ష చూపిస్తుదో.. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని అంటున్నారు.