జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంతకు ముందు వైసీపీ నేతలను విమర్శించలేదా..? ప్రభుత్వంపై విరుచుకుపడలేదా..? చాలా సార్లు విమర్శించారు.. విరుచుకుపడ్డారు. కానీ వైసీపీ నేతలు ఎప్పుడూ ఇంత సీరియస్గా రియాక్ట్ కాలేదు. కృష్ణా జిల్లా నానీలను ఇద్దర్ని మీడియా ముందుకు పంపి తిట్లు తిట్టించేవారు. కానీ ఇప్పుడు మాత్రం అందరూ స్పందిస్తున్నారు. చివరికి జగన్ తల్లి విజయా రాజశేఖర్ రెడ్డి కూడా పవన్ విమర్శలపై స్పందించారు. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా.. పవన్ విమర్శలను సీరియస్గా తీసుకున్నారు. ఖండించారు. ఎందుకు ఇంతగా వైసీపీ నేతలు పవన్ కల్యాణ్ విమర్శలపై స్పందిస్తున్నారు..? అనేది చాలా మందికి అర్థం కావడం లేదు. అయితే పవన్ చేసిన అన్ని విమర్శలపైనా స్పందించడం లేదు. కేవలం వివేకా హత్య విషయంలో పవన్ కల్యాణ్ చేసిన విమర్శలకే కౌంటర్ ఇస్తున్నారు. దీంతో..వైసీపీ వ్యూహమేంటో సులువుగానే అంచనా వేయవచ్చని కొంత మంది విశ్లేషిస్తున్నారు.
వైఎస్ వివేకా కుమార్తె సునీత ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి కన్నీరు పెట్టుకున్నారు. న్యాయం జరగడం లేదని బాధపడ్డారు. చాలా చాలా మాట్లాడారు. అవన్నీ ప్రజల్లో విస్తృతంగా వెళ్లాయి. ఆమె మాటలపై స్పందించాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. కానీ సునీత మాటలపై స్పందించడానికి వైసీపీ తరపున కానీ.. జగన్ ఫ్యామిలీలో కానీ ఎవరూ సిద్ధంగా లేరు. అలా స్పందిస్తే.. రివర్స్ అయ్యే ప్రమాదం ఉందన్న అంచనాకు వచ్చారు. అదే సమయంలో టీడీపీ విమర్శలపై స్పందించినా రాజకీయం ఇంకా ఎక్కువ అవుతుంది. అదే పవన్ కల్యాణ్ చేసిన విమర్శలను ఆధారంగా చేసుకుని తమ వాదన తాము వినిపిస్తే… బెటర్ అని వైసీపీ వ్యూహకర్తలు నిర్ణయానికి వచ్చి… పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ అంటూ ఒక్కొక్కరు తెర ముందుకు వస్తున్నట్లుగా భావిస్తున్నారు.
నిజానికి వివేకా హత్య కేసు అంశంపై … పవన్ కల్యాణ్ చాలా ఆలస్యంగా విమర్శలు చేశారు. ప్రతీ సారి టీడీపీ ఈ అంశాన్ని ప్రస్తావిస్తూనే ఉంటుంది. డీజీపీని కూడా కార్నర్ చేస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడూ వైసీపీ నేతలు స్పందించలేదు. ఇప్పుడు పవన్ కల్యాణ్ మాటల్ని అడ్డం పెట్టుకుని కేసు మా వద్ద లేదని… చెప్పుకునేందుకు విస్తృతంగా ప్రకటనలు చేస్తున్నారు. దీనికి జనసేన కౌంటర్ ఇవ్వాల్సి ఉంది. మూడు రోజుల నుంచి వైసీపీ నేతలు అదే పనిగా విమర్శలు చేస్తున్నా .. జనసేన వైపు నుంచి స్పందన రాలేదు.