జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జగన్ వంద రోజుల పాలన పై ఈరోజు స్పందించారు. దాదాపు తొమ్మిది కమిటీలను వేసి ఈ వంద రోజుల పాలన పై అధ్యయనం చేసి 33 పేజీల బుక్లెట్ విడుదల చేశారు. ఇతర పార్టీలపై చౌకబారు విమర్శలు చేసే పద్ధతికి జనసేన వ్యతిరేకం అని చెబుతూ, లోతైన అధ్యయనం చేసి, బాగుంది అంటే బాగుందని బాగా లేకపోతే బాగా లేదని వాస్తవిక పరిస్థితులను ప్రజలకు వివరించే విధానాన్ని తమ పార్టీ పాటిస్తుందని చెప్పిన పవన్ కళ్యాణ్ జగన్ పాలన పై లోతైన విమర్శలు చేశారు.
అన్ని నెలలపాటు పాదయాత్ర చేసి, ప్రజల లో ఉండి తాను ప్రజల సమస్యలను తెలుసుకున్నా అని చెప్పిన జగన్, ముఖ్యమంత్రి అయిన తర్వాత వంద రోజులు అయినప్పటికీ కనీసం ఒక ఇసుక పాలసీ ని రూపొందించ లేక పోయారు అని పవన్ ఎద్దేవా చేశారు. తమ మేనిఫెస్టోలో జగన్ 375 రూపాయలకే ఇసుక అందిస్తానని వాగ్దానం చేశారని, కానీ 975/- రూపాయలు పైబడి వసూలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. నిర్మాణ రంగంలో దాదాపు లక్ష మంది ఉపాధి కోల్పోయారని, జగన్ ఇసుక విధానాన్ని రూపొందించ లేకపోవడమే దీనికి కారణమని పవన్ కళ్యాణ్ దుయ్యబట్టారు. భవన నిర్మాణ కార్మికులు పస్తులు పడుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందో వైఎస్ఆర్సిపి అధినేత ఆత్మవిమర్శ చేసుకోవాలని పవన్ కళ్యాణ్ అన్నారు.
దాదాపు తొమ్మిది అంశాలపై ముప్పై మూడు పేజీల నివేదిక తయారు చేసిన పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్లో ప్రజారోగ్యం పడకేసిందని, పోలవరం వెనుకబడిందని, జగన్ పాలనలో పారదర్శకత దార్శనికత లోపించిందని విమర్శించారు.