తిత్లీ తుఫాను బాధిత ప్రాంతాల్లోని 48 గ్రామాల్లో పర్యటించామన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. విశాఖపట్నంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ… జరిగిన నష్టాన్ని పూర్తిస్థాయిలో బయటకి తెలియనీయకుండా ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. తుఫాను వస్తుందని ముందే తెలిసినా కూడా ప్రభుత్వం సరైన హెచ్చరికలు చేయలేదని ప్రజలు తనకు చెప్పారన్నారు. ముందస్తుగా అప్రమత్తం చేసి ఉంటే ప్రజలు జాగ్రత్తలు తీసుకునేవారనీ, ఇంత నష్టం జరిగి ఉండేది కాదన్నారు.
తుఫాను వల్ల జరిగిన నష్టాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయటకి చూపించడం లేదన్నారు. వాస్తవాలు బయటపెడితేనే కదా ఎవరైనా సాయం చేయడానికి ముందుకొస్తారన్నారు పవన్. అంతా బాగుందని ముఖ్యమంత్రే చెబుతూ ఉంటే సాయం ఎలా వస్తుందన్నారు? సహాయ చర్యల్లో కూడా వివక్ష ఉంటోందని తమ దృష్టికి వచ్చిందన్నారు. కొన్ని గ్రామాల్లో ఒక వీధిలో వారికి సాయం అందితే… ఆ పక్క వీధివారికి అందని పరిస్థితి ఉందన్నారు. గతంలో వీరు ఏ పార్టీకి ఓటేశారు, వైకాపా అభిమానాలా.. ఇలాంటి అంశాల ప్రాతిపదికనే సాయం చేస్తున్నారనీ, ఇక్కడ కూడా రాజకీయమేంటని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సందర్భంలో కూడా అధికారులకు ముఖ్యమంత్రి సన్మానాలు చేసి, సంబరాలు చేసుకోవడం ఏంటన్నారు. పడిపోయిన చెట్లను యుద్ధ ప్రాతిపదికన తొలగించకపోతే భవిష్యత్తులో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు పవన్!
జిల్లాలో కిమిడి కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు వంటి నాయకులు ఉన్నా… నష్టాన్ని ముందస్తుగా అంచనా వెయ్యలేకపోయారనీ, ఈ ప్రాంతాన్ని గాలికి వదిలేశారని ఆరోపించారు. ఈ ప్రాంతాల్లో సహాయక చర్యలు అద్భుతంగా జరిగిపోతున్నాయని గవర్నర్ నరసింహన్ మెచ్చుకోవడం కూడా కాస్త ఇబ్బందికరంగానే ఉందన్నారు. వాస్తవ పరిస్థితుల మీద ఆయనకి సంపూర్ణ అవగాహన లేదన్నారు. తిత్లీ తుఫాను విధ్వంసం తీవ్రస్థాయిలో ఉంటుందని కేంద్రం కూడా సరిగా హెచ్చరించలేదనీ, రాష్ట్రంపై వివక్షకు ఇది మరో నిదర్శనమని పవన్ ఆరోపించారు.
సినీ పరిశ్రమ నుంచి ఆశించిన సాయం రావడం లేదన్న ప్రశ్నకు స్పందిస్తూ… సినిమాల్లో ఉన్నవారు వేల మందికి తెలుస్తారేమోగానీ, వారి దగ్గర వేల కోట్ల రూపాయలు ఉండవన్నారు పవన్! అచ్చెన్నాయుడు లాంటి నాయకుల దగ్గర డబ్బులుంటాయన్నారు. జరిగిన నష్టంపై ఒక నివేదికను తయారు చేసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తామనీ, ప్రధానమంత్రి కూడా కలుస్తామని పవన్ చెప్పారు.