కాంగ్రెస్ పట్ల పవన్ కళ్యాణ్ కి ఉన్న వ్యతిరేకత గురించి అందరికీ తెలిసిందే. తన్న అన్నయ్య చిరంజీవే స్వయంగా కాంగ్రెస్ పార్టీని భుజానికెత్తుకొన్నప్పటికీ దానికి వ్యతిరేకంగా ప్రచారం చేసి ఎన్నికలలో ఓడించారు. మళ్ళీ ఈరోజు ఆయన తన ట్వీటర్ లో దానికి చురకలు అంటిస్తూ ఒక మెసేజ్ పెట్టారు. “నేను కాంగ్రెస్ పార్టీని చాలా ప్రేమిస్తాను…అభిమానిస్తాను…దాని పట్టుదల చూసి…బీజేపీ ప్రభుత్వంపై అది ప్రదర్శిస్తున్న పోరాట పఠిమను చూసి…కానీ ఒక్క లలిత్ మోడీ విషయంలో ఆ పార్టీ కనబరుస్తున్న ఈ శ్రద్ధ…పట్టుదల…పోరాట పఠిమ ఐదు కోట్ల ఆంద్ర ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడానికి చూపలేదు… కాంగ్రెస్ పార్టీని మెచ్చుకోక తప్పదు!”
కాంగ్రెస్ పార్టీని ప్రత్యేక హోదా కోసం పోరాడటం లేదని దెప్పి పొడుస్తున్న పవన్ కళ్యాణ్, మరి అదే ప్రశ్న నేరుగా ప్రధాని మోడీని, బీజేపీని అడగవచ్చు కదా? మోడీతో నేరుగా మాట్లాడగల చనువు, అవకాశం రెండూ ఆయనకి ఉన్నాయి. కానీ ఆయన మోడీని నిలదీయడం మాని తెదేపా ఎంపీలని, రాష్ట్రంలో ఒక్క ఎంపీ ఎమ్మేల్యే సీటు కూడా లేని కాంగ్రెస్ పార్టీని ఆయన నిలదీయడం చాలా విచిత్రంగా ఉంది. అయినా ఎవరో దాని కోసం పోరాడాలని ఆయన అందరికీ గుర్తు చేయడం కంటే ఆయనే స్వయంగా పోరాడవచ్చును కదా? తోటి నటుడు శివాజీ బీజేపీకి చెందినప్పటికీ ప్రత్యేక హోదా కోసం తన పార్టీని నిలదీశాడు. జల దీక్షలు, నిరాహార దీక్షలు చేసాడు. నేటికీ దాని కోసం మేధావులని కూడగట్టుకొని పోరాటం కొనసాగిస్తూనే ఉన్నాడు. కానీ ప్రత్యేక హోదా కోసం పోరాడేందుకు ముందుకు రమ్మని ఆయన ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ కి విజ్ఞప్తి చేసినా కనీసం స్పందించలేదు. అప్పుడే గనుక శివాజీకి మద్దతు పలికి ఉండి ఉంటే, కనీసం తన అభిమానులని శివాజీ పోరాటానికి మద్దతు తెలుపమని కోరి ఉండి ఉంటే కేంద్రం తప్పకుండా దిగివచ్చేది. కానీ అప్పుడు కనీసం స్పందించకుండా ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీని దెప్పిపొడవడం దేనికి అంటే ఆ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత కారణంగానేనని భావించవచ్చును. నిజానికి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక హోదా గురించి ఆసక్తి, చిత్తశుద్ధి లేకపోయినా, అది తన రాష్ట్రంలో ఉనికిని కాపాడుకోవడానికో లేకపోతే అధికార తెదేపా, బీజేపీలను ఇరుకున పెట్టడానికో ఆ మధ్యన దీక్షలు, కోటి సంతకాలు అంటూ ఏదో కొంత హడావుడి చేసింది. కానీ పవన్ కళ్యాణ్ ఏదో షూటింగ్ విరామంలో వీలున్నప్పుడు ప్రత్యేక హోదా కోసం ట్వీటర్ లో మెసేజ్ లు పెట్టడం తప్ప ఏమి చేస్తున్నారు? అని కాంగ్రెస్ పార్టీ ఎదురు ప్రశ్నిస్తే ఏమి జవాబు చెపుతారు? కాంగ్రెస్ పార్టీకి, తెదేపా ఎంపీలకి దీని గురించి పోరాడాలనే చిత్తశుద్ధి, పట్టుదల లేవని విమర్శిస్తున్న పవన్ కళ్యాణ్ మరి తను ఎందుకు పోరాడటం లేదు? కనీసం తన అభిమానులనయినా పోరాడమని ఎందుకు పిలుపు నీయడం లేదు? ప్రధాని ముందు ఆంధ్రా ఎంపీలకి గొంతు పెగలదని వెక్కిరిస్తున్న పవన్ కళ్యాణ్ తను వెళ్లి ఎందుకు మాట్లాడటం లేదు? కనీసం మొన్నటిలాగా మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడటం లేదు? అంటే బీజేపీతో, ప్రధాని మోడీతో తన సంబంధాలు పాడు చేసుకోవడం ఇష్టం లేకనేనని చెప్పుకోవలసి ఉంటుంది. ఇటువంటి ద్వంద వైఖరి అవలంభిస్తూ మళ్ళీ ఇతరులను నిందిస్తే ఇటువంటి విమర్శలే ఎదుర్కోక తప్పదు.