జనసేన అధినేత పవన్ కల్యాణ్ హఠాత్తుగా పార్టీ కార్యాలయానికి వెళ్తున్నారు. నూతనంగా నిర్మించిన అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ను ప్రారంభించేందుకు వస్తున్నట్లుగా జనసేన వర్గాలు చెబుతున్నాయి. అయితే తాజా పరిణామాలతో ఆయన బీజేపీపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అడిగారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టుకుని రూ.పది వేల కోట్లు మంజూరు చేయడంపై ఆయన అసంతృప్తితో ఉన్నారని జనసేన వర్గాలు చెబుతున్నాయి.
ఏపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేసే విధంగా వ్యవహరిస్తూంటే.. దానికి బీజేపీ వంత పాడటం పవన్ కు ఏ మాత్రం నచ్చడం లేదు. ఓ వైపు అమరావతి ని విధ్వంసం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా రైతులపై దాడులు చేస్తున్నారు. పరిశ్రమల్ని వెళ్లగొడుతున్నారు. శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తున్నారు. ఇలాంటి విషయాల్లో బీజేపీ ఏ మాత్రం జోక్యం చేసుకోకపోగా.. జగన్ కు మద్దతు ఇవ్వడం ఆయనను తీవ్ర అసంతృప్తికి గురి చేసిందని అంటున్నారు.
ఇప్పటి వరకూ పొత్తుల విషయంలో బీజేపీని ఒప్పిస్తామని ఆయన చెబుతున్నారు. కానీ ఇప్పుడు బీజేపీ ఇక జగన్ వెంటే ఉంటుందని.. ఆ పార్టీని కలుపుకుని వెళ్లడానికి బతిమాలాల్సిన అవసరం లేదనే నిర్ణయానికి వచ్చినట్లుగా జనసేన వర్గాలు అంచనా వేస్తున్నాయి. గురువారం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడితే బీజేపీ తీరుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. పవన్ కల్యాణ్… తాజా రాష్ట్ర పర్యటన కీలక రాజకీయ మార్పులు తేవడం ఖాయమని చెబుతున్నారు.